e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home చింతన పరమాత్ముడే శక్తి ప్రదాత!

పరమాత్ముడే శక్తి ప్రదాత!

శక్తియే జీవితం. శక్తిహీనత మరణం. మన జ్ఞానమే మనకున్న శక్తి. మనిషి జీవితం చిన్నదే కానీ, విలువైంది. జీవించినంత కాలం ఎదగటానికి మనిషికి శక్తి సామర్థ్యాలు ఎంతో అవసరం. మన జీవితంలో మనం అవలంబించే ఓర్పు, నేర్పు, క్షమ, ప్రేమలపైనే మన శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. శక్తి కావాలనీ, శక్తిని పెంపొందింపజేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు. శక్తిని పొందాలంటే మనం చేయాల్సిన పని ఒక్కటే. అది పరమాత్ముని అనుగ్రహం కోసం అనుక్షణం తపించడం. ఆ పరమాత్ముడే శక్తి ప్రదాత. మనలో ఉన్న సర్వశక్తులూ ఆ సర్వేశ్వరుడు ప్రసాదించినవే.


మనలో శక్తి ఉంటే మనమంతా శివం. లేకుంటే శవం. ‘శివ’మంటే శుభకరం, మంగళప్రదం, జయప్రదం, కల్యాణ ప్రదమన్నమాట. ‘శక్తి నీ ఆయుధమైతే విజయం నీ బానిస’ అంటారు వివేకానందస్వామి. ‘శక్తి’ అంటే ‘శారీరక సామర్థ్యం’ మాత్రమే కాదు. భౌతిక సామర్థ్యం శక్తికి కొలమానం కాదు. అకుంఠిత దీక్షయే అజేయమైన శక్తి. దృఢ నిశ్చయమే నిజమైన శక్తి. శక్తిమంతులెప్పుడూ విజేతలై విరాజిల్లుతారు. దేవతలు కూడా శక్తిమంతుల్నే ఆశీర్వదిస్తారు. అయోధ్యకు రాజైన దశరథుడు అత్యంత శక్తిమంతుడు. కాబట్టే, దేవదానవుల యుద్ధంలో దేవతలు దశరథుని సాయం కోరారు. మన పురాణాలు, ఇతిహాసాల్లో శక్తిని ఒక దేవతగా కొలిచేవారు. ‘రామాయణం’లో ఆంజనేయుడు మహా శక్తిమంతుడుగా సాక్షాత్కరిస్తాడు.
లంకా ద్వీపంలో సీతాదేవి ఉన్నట్లు వానరులకు తెలిసింది. కానీ, ‘సముద్రాన్ని దాటి లంకను చేరేవారు ఎవరా’ అని అన్వేషించడం ఆరంభించారు. సముద్రాన్ని లంఘించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఆంజనేయునిలోనే ఉన్నాయని జ్ఞాన వృద్ధుడు, వయోవృద్ధుడు అయిన జాంబవంతుడు గ్రహించాడు. అందుకే, అతని శౌర్యాన్నీ, ధైర్యాన్నీ, పరాక్రమాన్నీ అతనికి తెలియజేసి కార్యోన్ముఖుణ్ణి చేశాడు. సీతాదేవి కడకు చేరి, లంకా దహనం చేసి, స్వామి కార్యాన్ని సఫలీకృతం చేసిన మహా శక్తిమంతుడిగా ఆంజనేయుణ్ణి సుప్రతిష్ఠుణ్ణి చేసింది జాంబవంతుడే. నిద్రాణమై ఉన్న శక్తి సామర్థ్యాలను మేల్కొల్పిన తొలి వ్యక్తిత్వ వికాస నిపుణుడు జాంబవంతుడు. త్రేతాయుగంలో వ్యక్తిత్వ వికాసానికి అలా తొలి బీజం పడిందన్న మాట.
శ్రీహరి దుష్టశిక్షణ, శిష్టరక్షణ ప్రధాన కర్తవ్యాలుగా భావించి అవసరమైన చోట వామనుడైనాడు. అతడే త్రివిక్రముడైనాడు. నీచమైన వరాహాకృతినీ దాల్చాడు. ఈ విశ్వానికి నిరంతరం శక్తిని ప్రసాదిస్తున్నందువల్లే సూర్యుడు ఆకాశంలో 24 గంటలూ వెలుగొందుతూనే ఉన్నాడు. సూర్యుడి ప్రతాపం ‘శక్తి వితరణ’ రూపంలో ఉంది. ఇది ఒక త్యాగపూరిత కార్యం. ఆరు బయట మైదానంలో మండే అగ్నిగుండం నుంచి వెలువడే ‘ఉష్ణశక్తి’ గాలిలో గాలితో కలిసి వ్యర్థమవుతుంది. అదే ఉష్ణం ఇంజిన్‌ (యంత్రం)లో బంధింపబడితే ఒక చోదక శక్తిగా, ఒక సంవాహక శక్తిగా పరిణమిస్తుంది. శక్తి కేంద్రీకరణ ద్వారా అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. ఇనుమును తుప్పు బలహీన పరచినట్లు శక్తిమంతుణ్ణి స్వార్థం బలహీనపరుస్తుంది. అందుకే, మనం అనుక్షణం శక్తిని పెంపొందించుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తుండాలి. నిరంతరం వెలుగులీనే లోక బాంధవుడిలా మనిషి తన శక్తి సామర్థ్యాలను విశ్వ ప్రగతికీ, లోక కల్యాణార్థం వినియోగించాలి. అప్పుడే పరమాత్మ ద్వారా మనకు లభించే శక్తికి, మానవజన్మకు సార్థకత చేకూరుతుంది.

డాక్టర్‌ కె.వి.రమణ,
98480 98990

Advertisement
పరమాత్ముడే శక్తి ప్రదాత!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement