e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home చింతన నవవిధ భక్తి తత్తం!

నవవిధ భక్తి తత్తం!

నవవిధ భక్తి తత్తం!

సృష్టి ఆరంభమైన రోజే ‘యుగాది’. కాలచక్రం కదలడం మొదలైన రోజు కనుక ‘సంవత్సరాది’ అయ్యింది. ‘సంవత్సరం’ అంటే ‘సృష్టి సమయం’. కాల గమనం లేకపోతే ఋతువులు ఉండవు. ఋతువులు లేకుంటే రకరకాల పంటలు పండవు. పంటలు లేకపోతే ప్రాణికోటికి జీవనం ఉండదు. కనుక, ప్రజలు ఆయుష్మంతులు కావడానికి కాలమే ముఖ్య కారణం. దాని తొలి అడుగే ‘యుగాది’. చైత్రమాసంలో శుక్లపక్ష పాడ్యమినాడు సృష్టి మొదలైంది. ఈ తిథిని పురస్కరించుకొని ‘సంవత్సరాది’ పర్వదినాన్ని జరుపుకొంటున్నాం. సమస్త ప్రాణికోటికి ఆహ్లాదాన్ని కలిగించే రోజు ఇది. మానవుల మానసిక స్థితి ప్రశాంతంగా ఉండే రోజు. ఉల్లాసభరితమై, ద్వేషరహితమై, కల్యాణ కారకమై వర్ధిల్లే సమయం.

వసంత ఋతువులో వచ్చే ఈ పండుగ కవి-గాయకులకు ఉత్సాహాన్నిస్తుంది. మోడువారిన చెట్లను చిగురింపజేసినట్లే మానవ జీవితంలో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. పక్షుల కిలకిల రావాలతో, తుమ్మెదల ఝం కార ధ్వనులతో పూలతోటలు ప్రతిధ్వనిస్తాయి. కోకిలల కుహూరాగాలకు నవకవులు పరవశించి కొత్తగా కవిత్వానికి ప్రాణం పోస్తారు. ఈ పండుగ వేళ ఉగాది పచ్చడిని సేవించని తెలుగు వారుండరు. పచ్చడి కూడా సంవత్సరాదిలాగా అనాది నుంచీ వస్తున్న సంప్రదాయమే. ఆరు రుచులు (ఉప్పు- కారం- వగరు- పులుపు- చేదు- తీపి) పచ్చడిని ఆస్వాదయోగ్యం చేసిన తీరు అద్భుతం. ఇవన్నీ పచ్చడిలో కలిసిపోయినట్లే, వివిధ మనస్తత్వాలు కలిగినవారు ధర్మరక్షణలో ఒకటి కావాలన్న సందేశం అందుతుంది. ఆధునిక జీవనంలో కుండ మారిపోయింది. పచ్చని మామిడాకుల తోరణం మారిపోయింది. పచ్చడిలోను ఆరు రుచులకు బదులు కొత్త రుచులు వచ్చి చేరుతున్నాయి. కానీ, పచ్చడి చేసుకోవడమనే ఆచారం మిగిలే ఉంది.

ఈ ఆచారం వట్టిది కాదు. సాంస్కృతిక విలువలకు సంకేతం. అందుకే, ఇంకా పచ్చడిని ఆస్వాదిస్తున్నాం. యుగాది పచ్చడితోనే గాక ‘పంచాంగ శ్రవణం’తోనూ ప్రసిద్ధికెక్కింది. ‘పంచాంగ శ్రవణం’ సర్వపాప హరణంగా భావిస్తారు. యుగాది రోజు ‘తమ భవిష్యత్తు ఎట్లుంటుందో’ తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ మేరకు ఆ సంవత్సరమంతా జాగ్రత్త పడటానికి పంచాంగం ఒక దిక్సూచివలె పనిచేస్తుంది. తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలే పంచాంగాలు. ఇవన్నీ కాలగణనంలో ముఖ్యమైన భాగాలు. ఏ సమయంలో ఏ పనిచేస్తే శుభదాయకమో తెలియజేసే సమయ సూచికలివి. ఉగాది ఉరకలెత్తే ఉత్సాహానికి ప్రతీక. ఈ పర్వదినానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉంది.

శ్రీరామచంద్రుడు ఈ రోజే అరణ్య వాసాది క్లేశాలనుంచి బయటపడి అయోధ్యలో సింహాసనాధీశుడయ్యాడు. విక్రమార్కుడు కూడా అనంత సామ్రాజ్య సింహాసనం మీద అధిష్ఠితుడయ్యాడు. ఆర్యసమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి తన సిద్ధాంతాన్ని ఈరోజే ప్రారంభించాడు. ఏ శుభ కార్యక్రమం తలపెట్టినా దాన్ని ఉగాది నాడు జరుపుకోవడం అనాదిగా వస్తున్న భారతీయ ఆచారం. ఇంత ప్రశస్తిగల పర్వదినం పూర్వకాలంలో ప్రపంచానికే అనుసరణీయమైంది. వైదికులు మంత్రపూర్వకంగా యజ్ఞం చేసి ఈ పండుగను జరుపుకొంటారు. గృహాలను, పురవీధులను అలంకరిస్తారు. నూతన వస్ర్తాలు ధరిస్తారు. కమ్మని వంటకాలతో అతిథులను సంతోష పెడతారు. ప్రకృతిలోనే కాక మానవ జీవితంలో ఒక నూతనోత్తేజాన్ని కల్గించే యుగాది (ఉగాది) పండుగ విశ్వ సంస్కృతికే ప్రతిబింబం!

ఆచార్య మసన చెన్నప్ప
98856 54381

Advertisement
నవవిధ భక్తి తత్తం!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement