e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home చింతన నలుగురు రైతులు..28 క్షణాల్లో..

నలుగురు రైతులు..28 క్షణాల్లో..

‘సుధర్‌ జావో.. నహితో సుధార్‌ దియే జావోగే’ అంటే.. ‘మారుతారా మార్చమంటారా..’ అని. ‘నేను ఎంపీ, మంత్రి కాకముందు ఎలా ఉన్నానో.. నేను ఏమిటో తెలిస్తే.. లఖింపూర్‌ ఖిరి ఖాళీ చేసి పారిపోతారు..’ అని బహిరంగంగా రైతుల ఆందోళనను ఉద్దేశించి మాట్లాడతాడు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా.

‘బాప్‌ ఏక్‌ నెంబరీ, బెటా దస్‌ నెంబరీ’ అన్న చందాన తండ్రే అట్టా అంటే.. కొడుకు చేసి చూపించాడు. మదమెక్కిన దున్నలా తన కారును రైతులపైకి ఎక్కించి చంపాడు. పలువురు రైతులు, ఓ జర్నలిస్టు కారు టైర్ల కింద నలిగిపోయారు. ఇది రైతు ఉద్యమం పట్ల పాలకులకు ఉన్న అసహనానికి నిదర్శనం.

- Advertisement -

తండ్రి కేంద్రమంత్రి, అందునా హోంమంత్రి ఇక తనకు అడ్డేం ఉందనుకున్నాడు. ఉద్యమిస్తున్న రైతులపై కసి తీర్చుకోవాలనుకున్నాడు. సొంత జీపుతో ఆశిష్‌ మిశ్రా యూపీలోని లఖిమ్‌పూర్‌ వద్ద నల్లజెండాలు చేత పట్టి నడుచుకుంటూ వెళ్తున్న రైతుల మీదికి జీపు ఎక్కించి తొక్కించాడు. కాల్పులు జరిపాడు. రైతులు తేరుకోక ముందే నల్లని కారు ఒకటి, మరో స్కార్పియో వచ్చి రైతులను తొక్కేసి మంత్రి కొడుకు ఫరారయ్యాడు. అక్కడే ఉన్న పోలీసులు మంత్రి కొడుకును కవర్‌ చేసి పంపించారు! ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భీభత్స ఘటనకు సంబంధించి దారుణమైన దృశ్యాలు 28 సెకండ్ల వీడియోలో రికార్డయ్యాయి. ప్రపంచమంతా ఇది వైరలయింది. అబద్ధాలు చెప్తున్న ఆ తెలివి గల దొంగలను 28 సెకండ్ల వీడియో పట్టించింది. అయినా దీన్నీ కప్పిపుచ్చే రాజకీయం నడుస్తున్నది.

యూపీలోని లఖింపూర్‌కు దగ్గరలో సీతాపూర్‌ ఉంది. అక్కడ 48 గంటలుగా కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీని లఖింపూర్‌ వెళ్లడానికి వీల్లేదని నిర్బంధంలో ఉంచారు. మాజీ సీఎం అఖిలేష్‌ సహా విపక్ష నేతలంతా నిర్బంధించబడ్డారు. లఖింపూర్‌ ఘటనలో మరణించిన వారి అంత్యక్రియలు పూర్తికాలేదు. వారి కుటుంబాల్లో విషాదం కొనసాగుతున్నది. కానీ మోదీకి ఇదేమీ పట్టలేదు. ఘటనపై నోరు మెదపకుండా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. అజయ్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని, అతని కొడుకును అరెస్టు చేయాలని రైతు యూనియన్లు, విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు అజయ్‌ మిశ్రా.. ‘రైతులు తల్వార్లు.. లాఠీలతో దాడిచేశారని.. ఆత్మరక్షణకు పిస్టల్‌ పెట్టుకుంటే తప్పేం ట’ని, అసలు తన కుమారుడు ఆ ఘటనలో లేనే లేడని చెప్పుకొస్తున్నారు. రైతుల్లో తీవ్రవాదులు, బబ్బర్‌ ఖల్సా మద్దతుదారులున్నారని ఆరోపిస్తున్నాడు.

రైతులను వాహనాలతో తొక్కిచంపిన వాహన యజమానులను అరెస్టు చేయాలని, రైతుల పట్ల ఈ వ్యవహారం క్షమించరానిదని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ అనటం గమనార్హం. క్రిమినల్‌ చరిత్ర ఉన్న అజయ్‌ మిశ్రాకు హోం శాఖ ఇచ్చింది రైతు ఉద్యమాన్ని అణచివేసి, 2022లో యూపీ ఎన్నికలు గెలువడానికేనా? తన మంత్రివర్గంలో కేసులున్నవారికి స్థానమే ఉండదని చెప్పిన మోదీ.. మిశ్రా విషయంలో మౌనంగా ఎందుకున్నట్లో చెప్పాలి.

ఈ మధ్యకాలంలో.. హత్యలు, హింసా ఘటనల్లో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులైన ఎవరో ఒకరు బాధ్యులుగా ఉంటున్నారు. మన పాలకుల తీరు చూస్తే.. ‘చనిపోయినవారు రైతులు కాదు, తీవ్రవాదులు’ అనేట్లున్నారు. రేపు.. దేశ పౌరులే కాదు అన్నా అంటారు. జర జాగ్రత్త.. ఏడున్నరేండ్ల నరేంద్ర మోదీ పాలన నిరసన గళాలను నిర్బంధించటం, ఉద్యమాలను రక్తపుటేర్లలో ముంచటంగా సాగుతున్నది. అసలు ఇది ప్రజాస్వామ్య పాలనేనా..?

(వ్యాసకర్త: ఎండి.మునీర్‌ , సీనియర్‌ జర్నలిస్ట్‌)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement