e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home చింతన గౌరీ! గంధర్వ సేవితా..

గౌరీ! గంధర్వ సేవితా..

ఆది పరాశక్తి ఎన్నో రూపాలు ధరించింది. అవన్నీ లోక కల్యాణం కోసమే! అందులో ప్రధానమైనది పార్వతి. అమెనే గౌరీ అని సంబోధిస్తారు. ఇలా పిలవడం వెనుక ఒక ఐతిహ్యం ఉన్నది.
శంకరుడు స్ఫటికమణి నిభుడు. అంటే తెల్లని మేని ఛాయతో వెండికొండలా మెరిసిపోతూ ఉంటాడు. ఒకసారి శంకరుడు పార్వతివైపు చూసి ‘కాళీ!’ అన్నాడట. అంటే.. ‘నల్లనిదానా!’ అని భార్యతో పరిహాసమాడాడట. అలా సంబోధించడం పార్వతికి అదోలా అనిపించింది. అలిగింది. భర్తకు హాయినిచ్చే అందం తనకు లేదని చిన్నబుచ్చుకుంది. ‘నీకు ఇంపైన రంగున్న దేహాన్ని ధరించి వస్తాను’ అంటూ వెండికొండ దిగి తపస్సుకు వెళ్లిపోయింది. శివుడు బతిమాలినా పట్టించుకోలేదు. నిర్ణయం మార్చుకోలేదు.

కైలాసం వీడిన పార్వతి ఆకాశగంగలో స్నానం చేసింది. మూడుపూటలా శివార్చన చేయసాగింది. ఒకనాడు ఓ పులి వచ్చి పార్వతిని చూసింది. తక్షణమే దాని మాయావరణం తొలగిపోయింది. సత్వగుణంతో ప్రకాశించింది. అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఆమెకు ఎవరూ తపోభంగం కలిగించకుండా కాపుకాసింది. పార్వతి తపస్సు కొనసాగుతున్నది. ఓ రోజు అక్కడికి బ్రహ్మదేవుడు వస్తాడు. లోకాలను పీడిస్తున్న రాక్షసులు శుంభ, నిశుంభులను సంహరించాల్సిందిగా అమ్మను కోరుతాడు. పార్వతితో ఓ దివ్య రూపాన్ని ధరించమని చెప్తాడు. అప్పుడు ప్వారతీదేవి తన నల్లని మేనిఛాయను పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టుగా వదిలి.. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల మిశ్రమమైన గౌరవర్ణంతో శరీరాన్ని ధరించింది. అలా ‘గౌరి’ అన్న పేరును సార్థకం చేసుకుంది.
గౌరీదేవిగా శుంభనిశుంభుల సంహారానికి సిద్ధమవుతుంది పార్వతి. బ్రహ్మ ఆమెకు ఒక సింహాన్ని బహూకరిస్తాడు. అలా గౌరి సింహవాహిని అయ్యింది. వింధ్యపర్వతం మీద ఉండటం చేత వింధ్యవాసిని అయింది. శివుని సంతోషం కోసం పార్వతి గౌరిగా రూపుదాల్చినా.. లోక కల్యాణం కోసం అమ్మచేసిన లీల ఇది. గౌరిగా భర్త అయిన శివుడి మనసు గెలిచింది కాబట్టి.. నేటికీ పెండ్లి సమయంలో వధువుతో గౌరీపూజ చేయించడం సంప్రదాయంగా మారింది. వివాహ క్రతువులో గౌరీపూజ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగాలు సుస్థిరంగా ఉంటాయని నమ్మిక.
గౌరి, పార్వతి, దుర్గ మొదలైనవన్నీ ఆ దేవి దివ్య నామాలే. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి ఇవన్నీ అమ్మవారు దాల్చిన నవరూపాలు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఎనిమిదో నాడు అమ్మవారిని మహాగౌరిగా ఆరాధిస్తారు.

- Advertisement -

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాత్‌, మహాదేవ ప్రమోదదా॥

తెలుపు, పసుపు, ఎరుపు మిళితమైన గౌర వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది గౌరీ దేవి. మల్లెపూవులా, శంఖంలా, చంద్రునిలా కనిపించి మనసుకు హాయిని కలిగిస్తుంది. గౌరి అష్టవర్ష ప్రాయంతో శోభిస్తుంది. అంటే, ఎనిమిదేండ్ల బాలికలా వెలిగిపోతుంటుంది. వృషభ వాహనాన్ని అధిరోహించి చతుర్భుజాలతో కనిపిస్తుంది. కుడిచేతులలో అభయముద్ర, తిశ్రూలం ఉంటాయి. ఎడమ చేతులలో డమరుకం, వరద ముద్ర ఉంటాయి.

‘శంఖ కుందేందు వర్ణాచేత్‌ యతో గౌరీతిసా స్మృతా’ అని దేవీపురాణం చెప్తున్నది. ‘ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవితాయై’ అంటుంది లలితా సహస్ర నామం. గౌరీశక్తి అమోఘం. ఆ తల్లిని ఆరాధించిన వారికి సమస్త పాపాలూ తొలగిపోతాయి. ఎన్నో అలౌకిక సిద్ధులు కలుగుతాయి. ఇహపర సుఖాలు సంప్రాప్తిస్తాయి.

డా॥ వెలుదండ సత్యనారాయణ ,94411 62863

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement