e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home చింతన కరుణధార కాత్యాయని

కరుణధార కాత్యాయని

నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది అమ్మవారు. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్య తేజస్సుతో అలరారుతుంటుంది. కతు మహర్షి తపస్సంపన్నుడు. అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తాడు. ఆమె కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. కతుని దీక్షకు మెచ్చి దర్శనమిస్తుంది పరాశక్తి. ‘ఏం వరం కావాలి?’ అని అడుగుతుంది. అమ్మవారి అనుగ్రహం తప్ప మరే కోరికా లేని కతుడు… ‘నీవు నా ఇంట జన్మించి.. మా వంశాన్ని పునీతం చేయమ’ని కోరుకుంటాడు. కొన్నాళ్లకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య తేజస్సుతో కతుని ఇంట ఆవిర్భవించింది అమ్మవారు. కాత్యాయనిగా లోకప్రసిద్ధి పొందింది. కాత్యాయని అంటే తేజ స్వరూపిణి, మహాతేజో పుంజం అని అర్థాలు. తేజస్సు అంటే జ్ఞానం. అమ్మవారు జ్ఞానదాయిని. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవసాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థకామమోక్షాలకు అధికారిణి ఈమె.
‘పార్వతీదేవే కాత్యాయని’ అని అమరకోశం చెప్తున్నది. పతంజలి మహర్షి ‘దుర్గాదేవే.. కాత్యాయని’ అని అభివర్ణించాడు. శాక్తేయంలో కాత్యాయనీ దేవిని దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా పరిగణిస్తారు. మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి కాత్యాయని సింహ వాహనం అధిష్ఠించి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతున్నది. మార్కండేయ పురాణం, దేవీ భాగవతం కాత్యాయని ప్రాశస్త్యం గురించి ప్రస్తావించాయి. బౌద్ధ, జైన వాఙ్మయంలోనూ అమ్మవారి విశేషాలు కనిపిస్తాయి. యోగశాస్త్రం ప్రకారం కాత్యాయని ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవతగా చెప్తారు. ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మవారు.

చంద్రహాసో జ్జ్వలకరా శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ॥

- Advertisement -

అని చక్కగా అమ్మవారిని ధ్యానిస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. విద్యార్థులు అమ్మవారిని ఆరాధించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. కన్యలు కాత్యాయనీదేవిని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహమవుతుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వరుడు లభిస్తాడని నమ్మకం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి ప్రేమను పొందడానికి గోపికలు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించారు. హేమంత రుతువు.. మార్గశిర మాసంలో వణికించే చలిలో యమునా నదిలో స్నానం చేసి, కాత్యాయనీ దేవి సైకత మూర్తిని తీర్చిదిద్ది వ్రతం చేశారు గోపికలు.

కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి
నంద గోప సుతం దేవి పతియే కురుతే నమః॥

అని ధ్యానిస్తూ కాత్యాయనీ దేవిని ఉపాసించారు. ఆ తల్లి అనుగ్రహంతోనే గోపికలంతా శ్రీకృష్ణుడి అనురాగం పొందారని భాగవతం పేర్కొన్నది. కాత్యాయని ఆరాధన వల్ల ఉత్తమ సంతానం, కుటుంబవృద్ధి, సౌభాగ్యం, సంపదలు కలుగుతాయి.తమిళనాట కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి సమయంలో పాలు, పాల ఉత్పత్తులను త్యజించి ఆ నెలంతా కాత్యాయనీ దేవి సైకత రూపాన్ని ఏర్పాటు చేసుకొని.. భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో వ్రతం ఆచరించే సంప్రదాయం నేటికీ కనిపిస్తుంది. తక్షణ రక్షణ శక్తిగా పేరున్న కాత్యాయని ఆరాధన సకల భయాలనూ తొలగింపజేస్తుంది. ‘కాత్యాయని నమోస్తుతే’ అని మనసారా ఆరాధించిన వారిపై సదా కరుణ వర్షం కురిపిస్తుంది ఆ తల్లి.

-డా॥ పార్నంది రామకృష్ణ ,94920 07002

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement