e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home చింతన ఉత్తముల ధర్మసూక్ష్మాలు

ఉత్తముల ధర్మసూక్ష్మాలు

ఉత్తముల ధర్మసూక్ష్మాలు

విపది ధైర్యమథాభ్యుదయే క్షమా
సదసి వాక్పటుతా యుధి విక్రమః
యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ
ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనామ్‌

  • నీతి శతకం (భర్తృహరి: 53)
    ఆపదలలో ధైర్యంగా ఉండటం, సంపదలు ఉన్నప్పుడు ఓర్పును చూపించడం, అవసరానికి తగ్గట్టు సభలలో వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం, యుద్ధంలో పరాక్రమాన్ని చూపటం వంటివాటితోపాటు కీర్తిప్రతిష్ఠలను సంపాదించుకోవడం, విజ్ఞానాన్ని పెంచుకోవడంలోనూ ఆసక్తిని కలిగి ఉండటమనేవి ఉత్తముల లక్షణాలు. ఎప్పుడు కూడా అబద్ధాలకు తావివ్వకుండా, ఇతరులను దూషించకుండా మెలగాలి. అనవసర తగాదాలకు ఆస్కారం ఇవ్వకుండా, మనసును నొప్పించే మాటలు మాట్లాడకుండా ఉండేవారినీ ఉత్తములుగా మన సనాతన ధర్మం (మహాభారతం,శాంతిపర్వం: 5-32) పేర్కొన్నది. ఉత్తములెప్పుడూ స్వపర భేదాలకు గానీ సుఖదుఃఖాలకు గానీ తావివ్వకుండా మసలుకుంటారు. ఎవరైనా రెచ్చగొడుతూ మాట్లాడినా కూడా ఉద్రేకపడరు. చెరగని చిరునవ్వుతోనే ఉంటారు. ఏ మాత్రం కక్షలు, ప్రతీకారానికి ఆస్కారం ఇవ్వకుండా తోటివారికి మేలు కలిగించే మాటలే మాట్లాడుతుంటారు.

నిజాయితీగా ఉండేవారికి ఒక్కొకసారి ఇతరుల వల్ల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దీనికి ఉదాహరణగా ‘మహాభారతం’లోని ‘వ్యాఘ్ర గోమాయువు సంవాదం’(కథ) ఉంది. ‘వ్యాఘ్రం’ అంటే పెద్దపులి, ‘గోమాయువు’ అంటే నక్క. స్నేహానికి ఆస్కారమే లేని ఈ రెండు జంతువుల కథ ఇది. ‘పురిక’ అనే పట్టణంలోని పౌరికుడు అనే రాజు వివేకాన్ని మరిచిపోయి క్రూరకర్మలు చేస్తూ జీవించేవాడు. దాని ఫలితంగా అతడు మరణించి నక్కగా పుడతాడు. తనకు పుట్టుకతో అలవడిన పూర్వజన్మ జ్ఞానంతో తన పాపాల వల్లే ఈ దుస్థితి దాపురించిందని తెలుసుకున్నాడు. మనసు మార్చుకొని హింస చేయకుండా, మాంసం తినకుండా, ఎంతో నియమనిష్ఠలతో ఉంటాడు. ఈ నక్కను చూసిన మిగతా జంతువులన్నీ దానికి సేవలు చేయసాగాయి. ఈ విషయాన్ని ఆ నోటా ఈ నోటా విన్న ఒక పెద్దపులి ఆ నక్క దగ్గరికి వచ్చి స్నేహం కోసం బతిమిలాడింది.

‘నా వ్యక్తిత్వాన్ని సహించలేని నీ సేవకులు ఏదో నెపంతో నా గురించి చెడుగా చెబుతారు. అప్పుడు నీ వల్ల నాకు ముప్పు కలుగుతుంది’ అని ముందే ఆ నక్క హెచ్చరింది. అలాంటివాళ్ల మాటలను ‘తాను నమ్మనని’ పులి వాగ్దానమూ చేసింది. తనకు తోచిన ధర్మసూక్ష్మాలను చెబుతున్న ఆ నక్కను చూసి, ఓర్వలేని జంతువులు దానిపై పితూరీలు చెబుతూ, పులి తినే మాంసాన్ని దాచిపెట్టి ఆ నేరాన్ని నక్కపైన మోపాయి. ఆ మాటలను నమ్మిన పులి ఆ నక్కను వధించటానికి పూనుకుంది. అప్పుడు ఆ పెద్దపులి తల్లి హితోపదేశం చేసింది. ‘బుధ్ధిమంతుడిని చూసి ఓర్వలేని దుర్మార్గులు వాళ్ల గురించి ఏవో కల్పించి అబద్ధాలు చెబుతుంటారు. విజ్ఞులైన వాళ్లు బుద్ధిని ఉపయోగించి అందులోని మంచిచెడులను తెలుసుకోవాలి’ అని చెప్పి దానిని మార్చివేసింది.


ధర్మమధర్మము భంగి న
ధర్మము ధర్మంబు మాడ్కిఁ దనయా తోఁచున్‌
నిర్మల మతి నరయ వలయు
ధార్మికతను కోరువాఁడు దనకేర్పడఁగన్‌ ॥

తిక్కనామాత్యుడు (మహాభారతం, శాంతిపర్వం: 3-71)
‘ఒక్కోసారి కొన్ని ధర్మాలు అధర్మంగానూ, అధర్మాలు ధర్మంగానూ కనిపిస్తుంటాయి. విజ్ఞులు ఈ ధర్మసూక్ష్మాన్ని తెలుసుకొని, స్వఛ్ఛమైన మనసుతో ఆలోచించి వాస్తవాలను గ్రహించాలి’. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ నక్కకు కనువిప్పు కలిగింది. ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి తన దారి తాను చూసుకున్నది. ‘తెలిసో తెలియకో మన ఆప్తున్ని అవమానించి, బాధ పెట్టి మళ్లీ అతనితో సహవాసం చేయాలని చూస్తే మంచి జరుగదు గాక జరుగదు’ అనేదే ఇందులోని నీతి. నిజాయితీగా ఉండేవారికి ఇలాంటి చేదు అనుభవాలు జీవితంలో ఎదురవుతుంటాయి. మనం నిబద్ధతతో ఉన్నప్పుడు సత్కర్మాచరణతోనే అవన్నీ తొలగిపోతుంటాయని సనాతన ధర్మం ఉపదేశిస్తున్నది.

డాక్టర్‌ శాస్ర్తుల రఘుపతి ,73867 58370

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉత్తముల ధర్మసూక్ష్మాలు

ట్రెండింగ్‌

Advertisement