e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home చింతన ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక ధారావాహిక

ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక ధారావాహిక

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. ఆ తర్వాత, ఎన్నో మలుపులు. యుద్ధ రూపంలో ఓ తీవ్ర సంక్షోభం ఎదురవుతుంది. అదీ తాత్కాలికమే.

‘తపస్సు అంటే ఒకే ఒక్క పనిపైన సర్వశక్తులూ లగ్నం చేయడం. సంకల్పించినది సాధించడం’.. అని గిరిధరుడు చెప్పిన తరువాత, యాదరుషికి కలిగిన సందేహం..
తపస్సు చేయడానికి స్థలం, సమయం, సందర్భమూ ప్రత్యేకంగా ఉండాలా? లేక ఎక్కడైనా, ఎప్పుడైనా తపస్సు చేయవచ్చా?
అదే సందేహాన్ని గిరిధరుడికి చెప్పాడు.
గిరిధరుడు ఒక్కక్షణం ఏదో ఆలోచించాడు.
“యాదరుషీ! తపస్సు చేయడానికి సమయం, సందర్భమూ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంకల్పించిన సమయమే సందర్భమవుతుంది. కానీ, స్థలం పవిత్రంగా ఉండాలి. దానికొక మాహాత్మ్యం ఏర్పడాలి. తపస్సు సిద్ధించినప్పుడే దేవుడు కనిపిస్తాడు. వరమిస్తాడు. అయితే సంకల్పించిన వ్యక్తికి చిత్తశుద్ధి ఉండాలి. మూసిన కనులతో ఒకే ఒక దృశ్యాన్ని దర్శించాలి. శ్వాస, ధ్యాస సంపూర్ణంగా స్వామిపైన లగ్నమై ఉండాలి. అప్పుడే అర్హత ఏర్పడుతుంది. ఎప్పుడో ఒకప్పుడు కోరినది నెరవేరుతుంది”.. గిరిధరుడి మాటలు యాదరుషిలో ఆశను పెంచాల్సింది పోయి, నిరాశను కలిగించాయి.
“అర్హత అనుకొంటే.. ఎవరి అర్హతను ఎవరు చెప్పగలరు? అందుకు ప్రామాణికాలేముంటాయి? సంకల్పం వరకు ఎవరికి వారు చెప్పుకోగలరు. ఎవరి సంగతో ఎందుకు? నాకు స్వామిని దర్శించాలనే దృఢ సంకల్పం ఉంది. కానీ, అది మాత్రమే సరిపోతుందా? అర్హత వచ్చేస్తుందా?”
తనలో తను అనుకొంటున్నట్టుగా.. పైకే అన్నాడు యాదరుషి.

- Advertisement -

“అర్హత అనేది కోరుకొంటే వచ్చేది కాదు. సంకల్పిస్తే వచ్చేదీ కాదు. అది సాధించినప్పుడే వస్తుంది. యోగ్యతాయోగ్యతల ప్రసక్తి ఇప్పుడు అవసరం లేదు. నువ్వు అనుకొంటున్నావేమో.. తపస్సు చేస్తే స్వామి దర్శనమిస్తాడని! అది అవునో, కాదో ముందే ఎవరైనా ఎలా చెప్పగలరు? నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. ఫలితాన్ని పరమాత్ముడికి వదిలెయ్యి” చెప్పాడు గిరిధరుడు.
“ఎవరికైనా వెళ్లాల్సిన చోటుకు వెళ్లిన తరువాత.. వెనక్కి తిరిగి చూసుకొంటే, తాను వచ్చినదారి ఇంత సులభమా! అనిపిస్తుంది. కానీ, అక్కడికి చేరడానికి ముందు, అదే దారి.. ఎక్కలేని కొండలాగా, దారిని కనబడనివ్వని బండలాగా కనిపిస్తుంది.. గిరిధరా! మరొకరికి చెప్పడం చాలా సులభం. అదే పని మనమే చేయాల్సి వస్తే అది చాలా కఠినం!” వినయంగానే అయినా స్పష్టంగా చెప్పాడు యాదరుషి.
“అనుకొన్న పని, అవుతుందో కాదో అనే సందేహం ఉన్నప్పుడు.. ఇంక ఆ ప్రయత్నం చేయడం దేనికి? ‘నేను కాకపోతే ఎవరు సాధించగలడు?’ అనుకోవడం ఎంత అహంకారమో.. ‘నావల్ల ఇదెప్పటికీ కాదేమో!’ అనుకోవడం కూడా అంతే ఆత్మన్యూనత. సాధకుడికి ఈ రెండూ పనికిరావు. ‘నేను చేయగలను’ అని బలంగా సంకల్పిస్తే, నువ్వా తపస్సు చేయగలవు. ‘నావల్ల కాదేమో!’ అనుకొంటే.. నీవల్ల ఎప్పటికీ కానేకాదు.. నిర్ణయం తీసుకో. కష్టాలకు ఎదురు నిలిచి, ఘోరమైన తపస్సు చేయాలో, ఇష్టాలను వదిలిపెట్టి ఇంటికి తిరిగివెళ్లి, సుఖంగా జీవితం గడపాలో! ఆలోచించు..” అని చెప్పి, గిరిధరుడు వెనక్కి తిరిగి చూడకుండా, వడివడిగా కొండ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు.

ఎవరీ గిరిధరుడు?
తనకు ఏం చెప్పాలనుకొన్నాడు?
మనసు సందిగ్ధంలో ఉన్నప్పుడు, మహాత్ములు చెప్పిన మాటలు మనకు దారి చూపిస్తాయి.
మంచీ – చెడూ చెప్తాయి.
అది మనం తీసుకొనే భావాన్ని బట్టి ఉంటుంది.
మనం నిర్ణయం తీసుకొన్నాక, ఎటు వెళ్లాలో తోచనప్పుడు.. ఎవరో వస్తారు. ఏదో సూచిస్తారు. వారు మనవారు కావచ్చు. మరొకరు కావచ్చు. మనుషులే కాదు.. ప్రకృతి కూడా మనకు సంకేతాలు ఇస్తుంది.
ఏదో తెలియని దైవిక శక్తి మనల్ని అహర్నిశలూ గమనిస్తుంటుంది.
ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకొంటారు? అని ఏ ఒక్కరూ అనుకోనక్కరలేదు.
చూస్తాడు.. ఆ పైవాడు అన్నీ చూస్తాడు. ప్రతి దానికీ ఓ లెక్క రాస్తాడు. మనం చేసినవన్నీ మన ద్వారానే తెలుసుకోనవసరంలేదు. మనం సంతోషపెట్టిన వారి కళ్లలో ఆనందాన్ని కొలుస్తాడు. మనం బాధపెట్టిన వారి కన్నీటి లోతులను లెక్క గడుతాడు. ఏదీ వదిలిపెట్టడు. ఎవర్నీ వదిలిపెట్టడు. అందుకే, అమ్మ.. తనను అందరికీ అప్పజెప్పింది. పశుపక్ష్యాదులకు, ప్రకృతికి, సకల సృష్టికి కారణభూతుడైన దేవదేవుడికి!
తప్పదు అన్వేషణ
తప్పదు పరివేదన
తప్పదు శోధన
తప్పదు సాధన
నమో శ్రీ నారసింహా!
నడక సాగుతూనే ఉంది. వెతుకులాట కొనసాగుతూనే ఉంది.
సర్వ క్షేత్రాణి తీర్థాని ఋషిణామాశ్రమాణిచ
పర్యటన్వివిధాన్దేశా న్దృష్టాపృష్టాబహు శృతాన్‌
యాదరుషి అనేక క్షేత్రాలను దర్శించాడు. తీర్థములను సందర్శించాడు. మహర్షుల ఆశ్రమాలను చేరుకొని.. తిరిగి తిరిగి, బహుశృతులైన పెద్దలను సేవించి, వారిని ఎన్నెన్నో సార్లు ప్రశ్నించి చూశాడు.
అడిగిందే మళ్లీ అడిగాడు.
“ఎలా నా నరసింహుడి దర్శనం పొందడం?”
ఉహూ!
ఎక్కడా సమాధానం దొరకలేదు.
దర్శనం ఎవరికి వారు పొందవలసిందే!
ఒకరు విన్నది మరొకరికి ఎలా వినిపిస్తుంది?
ఒకరు తిన్నది మరొకరికి ఎలా వంటబడుతుంది?
ఒకరు చూసింది.. తాము కనులారా చూడకుండానే మరొకరు ఎలా చూడగలరు?
ఒకరి దర్శనం.. మరొకరికి నిదర్శనం అవుతుంది తప్ప, మరొకరి అనుభవంలోకి ఎలా వస్తుంది?
అందరు పెద్దలూ, రుషులూ, మహానుభావులూ.. ఎవర్ని కలిసినా, యాదరుషికి ఒకటే చెప్పారు.
“నువ్వు తపస్సు చేయి. ఫలిస్తే.. నరసింహుడు నీకు దర్శనం ఇస్తాడు. ఇందులో మరొకరు చేయవలసింది, చెప్పవలసిందీ ఏమీ లేదు”
యాదరుషికి ఏం చేయాలో అర్థం కావడం లేదు.

అనుకొన్న పనిని ఆపివేసి, వెళ్లిపోదామా అనుకొంటే.. అసలు స్వామి దర్శనం కాకపోతే తన జన్మకు అర్థమేమిటి? అనిపిస్తున్నది.
నదులూ, అరణ్యాలు, కొండలు, వన్యమృగాలు, అడవి పక్షులు, చీకటివెలుగులను ఏర్పరచే సూర్యచంద్రులు, వర్షాన్ని కురిపించే మేఘాలు, ప్రమిదలో వెలుగుతున్న వత్తిని ఆవరించుకొన్న వెలుతురులా.. వెంటాడే ఆలోచనలు. ఇవేవీ తనను నిలవనీయడం లేదు.
తను నడుస్తున్నది.. ముందుకా? వెనక్కా?
నడిచీ, నడిచీ నిలబడి పోయాడు ఒక దగ్గర.
అలాగే కనులు మూసుకొని నరసింహుణ్ని ధ్యానిస్తూ..
భూమి నుండి మొలిచిన చెట్టు లాగా.. నీటి ప్రవాహంలో నిశ్చలంగా నిలబడ్డ బండలాగా..
కాలం కదుల్తోంది కానీ, అతనిలో చలనం లేదు.
యాదరుషి స్థిరంగా అలానే నిలబడి పోయాడు.
ఒకటే ధ్యాస..
ఒకటే శ్వాస..
నమో నారసింహా.. నమో నారసింహా..

మనుషులకు మంచి జరగాలనుకొన్నప్పుడు, గతంలో ఎన్నడూ కననిది, విననిది సాధించాలనుకొన్నప్పుడు.. ఆ సాధకుడు సాధారణ స్థితిలో ఉండడు. ఉన్మాదంలాగా కనిపించే అసాధారణ దశకు చేరుకొంటాడు. ఏమి తిన్నామో.. ఎక్కడున్నామో.. ఏదీ గమనించడు. ఏదీ పట్టించుకోడు. ఒక్కటే దృష్టి. ఒక్కటే గమనం. ఒక్కటే గమ్యం!
అదొక్కటే కనుల ముందు కనబడుతుంది.
యాదరుషి నిశ్చలంగా నిలబడి ఉండగానే.. ఉరుములు, మెరుపులతో భీకర వర్షం మొదలయ్యింది. వాగులూ వంకలూ ఏకమై, జలప్రళయం వచ్చిందా? అన్నట్టుగా ప్రవాహాలు ఉప్పొంగుతున్నాయి. పెనుగాలికి బలమైన వృక్షాలుకూడా అల్లల్లాడి పోతున్నాయ్‌.
దుమ్మూ దుమారం ఉవ్వెత్తున ఎగసి పడుతున్నది. చెట్లు.. కూకటివేళ్లతో సహా భూమిలోంచి విచ్చుకొని వచ్చి.. గాలిలో గిరికీలు కొడుతున్నాయ్‌.
యాదరుషికి ఇవేమీ తెలియడం లేదు.
లోలోపల నరసింహుడి ఊహా చిత్ర దర్శనం తప్ప.. బయట ఏమి జరుగుతున్నదో ఏమీ తెలియడం లేదు.
ప్రకృతి దయగా ఉంటే.. అమ్మ ఒడిలో ఉన్నట్టే! కన్నెర్ర జేస్తే.. కల్లోల సముద్రంలో చిక్కుకొన్న పడవలా మునిగి పోవలసిందే!
ఒక సర్పం.. గాలి వేగానికి కొట్టుకొస్తోంది.
బలవంతమైన, పొడుగైన, భయంకరమైన ఆ పాము.. గాలిలో తలకిందులవుతూ పట్టుకోసం యాదరుషి కాళ్లను చుట్టుకొన్నది.
రాతి స్తంభాల్లా కదలకుండా ఉన్న యాదరుషి పాదాలను గట్టిగా చుట్టుకొని, పడగ ఎత్తి పైకి చూసింది.
చిమ్మచీకటిలో ఒక్కసారిగా వచ్చిన మెరుపు.. ఆ విష సర్పం కళ్లలో పదునైన కాంతి రేఖలాగా ప్రతిఫలిస్తున్నది.
అది దిక్కు తోచక గాలికి ఆడుతున్న తలను బలవంతంగా కదలకుండా అణిచిపెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది.
యాదరుషి కనులు మూసుకొని ఉన్నాడు.
లోలోపల ఒక అద్భుతమైన కాంతిపుంజం.. దారి చూపుతున్న దివిటీ లాగా మునుముందుకు వెళ్తున్నది. అడవి మధ్యలో, కొండ దారిలో ఒక గుహ.. అడ్డంగా ఒక బండరాయి. తను తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
ఊహూ.. ప్రయత్నం నిష్ఫలమవుతున్నది.
ఏం చేయాలి?
ఎలా స్వామిని దర్శించుకోవాలి?
అకస్మాత్తుగా కళ్లు తెరిచాడు.
అప్పుడు కనిపించిందతనికి.. తన మెడను చుట్టుకొని, తననే తీక్షణంగా చూస్తున్న భయంకర సర్పం. కనులలో కనులు పెట్టి చూశాడు.
భయం కలగలేదు.
తన ముందున్న సందిగ్ధత తీరిపోతున్నట్టుగా అనిపించింది.
తనకు స్వామి దర్శనం దొరక్కపోవడమే.. మరణంలాంటిది.
ఈ జన్మలో అది దుర్లభమైతే.. మరొక జన్మంటూ ఉంటే, బహుశా అప్పుడు నెరవేరుతుందేమో! తన చిరకాల స్వప్నం.
మరొక జన్మ రావాలంటే.. ముందు ఈ జన్మ నుంచి విముక్తం కావాలి.
అందుకేనేమో.. దేవుడు ఈ మార్గం చూపాడు.
“ఓ విష సర్పమా! నన్ను కసితీరా కాటేసి పో.. నీ విషం జరజరా నా ఒళ్లంతా పాకి, క్షణంలో నేను ఈ శరీరం నుండి విముక్తుణ్ని కావాలి”..
అలా పాము కళ్లలో కళ్లు పెట్టి చూస్తున్నాడు.
యాదరుషి మనోభావన అర్థమయ్యిందా.. అన్నట్టుగా విషసర్పం తన నాలుకలు చాపి, అతని ముఖం మీదకు తలను తీసుకొచ్చింది.
నవ్వుకొన్నాడు యాదరుషి.
బతికుండటం అంటే..
అనుకున్నది సాధించడం!
సాధించలేకపోవడం అంటే..
బతికి లేకపోవడం!
తన మనసు ఎందుకిలా ఆలోచిస్తున్నదో తనకే అర్థం కావడంలేదు.
స్వామి దర్శనం దొరుకుతుందనే తను అనుకొన్నాడు. ఆరాట పడ్డాడు. అన్వేషించాడు. తన అన్వేషణ ఇంత అర్థంతరంగా ఆగిపోతుందా? కూడదు! తను బతికి ఉంటేనే.. తన ప్రయత్నం, సంకల్పం బతికి ఉంటుంది.
తను జీవిస్తేనే.. తన కల నెరవేరుతుంది.
గాలివాన మరింత బీభత్సంగా మారింది.
ఎప్పుడైతే ఆయన మనసు కాస్త సంశయంలో పడిందో.. పరిస్థితి బలహీన పడింది.
కాళ్లు భూమ్మీదనుండి పట్టుతప్పి..
గాల్లోకి లేచాయి.

కాళ్లనుండి మెడదాకా చుట్టుకొన్న భయంకర సర్పంతో సహా భూమ్మీద నుండి పైకి లేపింది.. వాయు ప్రభంజనం!
గాల్లోకి లేస్తుండగానే పాము ఆయన మెడను వదిలి, చెట్టుకొమ్మను పట్టుకోడానికి ప్రయత్నం చేసింది. రెండుసార్లు విఫలమయ్యింది.
చివరికి తలతో చెట్టుకొమ్మను పట్టుకోగలిగింది. చెట్టుకు తాడుతో కట్టినట్టు.. ఒకవైపు యాదరుషిని, మరొకవైపు చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకొన్నది.
అయితే.. ప్రకృతి అంతటితో శాంతించలేదు.
పెనువేగంతో పామును పైకెగరేసింది.
పట్టుతప్పి పాము గాల్లోకి విసిరేసినట్టుగా ఎగిరిపోయింది.
దాని పట్టునుండి బయటపడిన యాదరుషి.. చెట్టు కొమ్మ మధ్యలో పడిపోయి, అలాగే ఉండిపోయాడు.
మళ్లీ స్పృహ తప్పింది. దృష్టి బాహ్య ప్రపంచం నుండి లోలోపలికి మళ్లింది.
కనుల ముందు.. సాక్షాత్కరించాడు..
హనుమంతుడు.
వాయుపుత్రుడు!
యాదరుషి దిగ్భ్రమతో చూశాడు.

మనం నిర్ణయం తీసుకొన్నాక, ఎటు వెళ్లాలో తోచనప్పుడు.. ఎవరో వస్తారు. ఏదో సూచిస్తారు. వారు మనవారు కావచ్చు. మరొకరు కావచ్చు. మనుషులే కాదు.. ప్రకృతి కూడా మనకు సంకేతాలు ఇస్తుంది. ఏదో తెలియని దైవిక శక్తి మనల్ని అహర్నిశలూ గమనిస్తుంటుంది. ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకొంటారు? అని ఏ ఒక్కరూ అనుకోనక్కరలేదు. చూస్తాడు.. ఆ పైవాడు అన్నీ చూస్తాడు. ప్రతి దానికీ ఓ లెక్క రాస్తాడు. మనం చేసినవన్నీ మన ద్వారానే తెలుసుకోనవసరంలేదు. మనం సంతోషపెట్టిన వారి కళ్లలో ఆనందాన్ని కొలుస్తాడు. మనం బాధపెట్టిన వారి కన్నీటి లోతులను లెక్క గడుతాడు. ఏదీ వదిలిపెట్టడు. ఎవర్నీ వదిలిపెట్టడు. అందుకే, అమ్మ.. తనను అందరికీ అప్పజెప్పింది. పశుపక్ష్యాదులకు, ప్రకృతికి, సకల సృష్టికి కారణభూతుడైన దేవదేవుడికి!

తనకు స్వామి దర్శనం దొరక్కపోవడమే.. మరణంలాంటిది. ఈ జన్మలో అది దుర్లభమైతే.. మరొక జన్మంటూ ఉంటే, బహుశా అప్పుడు నెరవేరుతుందేమో! తన చిరకాల స్వప్నం. మరొక జన్మ రావాలంటే.. ముందు ఈ జన్మ నుంచి విముక్తం కావాలి. అందుకేనేమో.. దేవుడు ఈ మార్గం చూపాడు.

-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement