e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home చింతన ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక ధారావాహిక యాదాద్రి వైభవం

ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక ధారావాహిక యాదాద్రి వైభవం

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. కానీ అంతటితో కథ సుఖాంతం కాలేదు. ఎన్నో మలుపులు.

సాక్షాత్తు శ్రీ రామభక్తుడూ, అమేయశక్తిశాలి ప్రసన్నాంజనేయుడే తనకు ప్రత్యక్షమై శ్రీ నారసింహుడి అనుగ్రహం కోరి ఎలా తపస్సు చేయాలో చెప్పడం.. యాదరుషికి ఇంకా నమ్మశక్యంగా లేదు. ఏనాటి కోరిక తనది? ఎన్నేండ్ల కల తనది? స్వామిని దర్శించాలని, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కనులారా వీక్షించి, ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేసుకోవాలనే తన సంకల్పం నెరవేరుతుందా? అనే సందేహం ఉండేది ఇంతకాలం.

- Advertisement -

ఇప్పుడు తన కల ఫలించడానికి ఒక దారి దొరికింది.
లంకలో నిర్బంధించబడ్డ సీతమ్మ తల్లిని వెదకి, కనుక్కొని శ్రీరాముడికి సమాచారం చెప్పిన హనుమంతులవారే.. గుహలో ఉన్న శ్రీ నారసింహుడి అవతార రహస్యం, అనుగ్రహ భాగ్యం పొందే మార్గం చెప్పారు.
తను ఎంత అదృష్టవంతుడు?
మనం ముందు మనసులో అనుకొంటే, అవుతుంది.. నమ్మితే, అది అయి తీరుతుంది. ప్రహ్లాదుని కరుణించినవాడు, లోకానికి పట్టుకొన్న పీడను క్షణంలో తొలగించినవాడు శ్రీనారసింహుడు. నిజాయితీతో ప్రార్థిస్తే ఎవరినైనా అనుగ్రహిస్తాడు. బాధలు తీరుస్తాడు. శాశ్వతంగా ఉండే సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు.

ప్రహ్లాద! ప్రభుతాస్తి చేత్తవ హరే.. స్సర్వత్రమే దర్శయ!
స్తంభేచైవ హిరణ్యకశ్యపు పురస్తత్రా విరాసీద్ధరిః
వక్షస్తస్య విదారయ న్నిజనఖైర్వాత్సల్యమావేదయ!
ఆర్తత్రాణ పరాయణ స్సభగవాన్నారాయణోమే గతిః
.. భగవంతుడైన నారాయణుడు తన సర్వవ్యాపకతను.. అంటే అంతటా తానే ఉన్నానని చూపడం కోసం స్తంభం నుండి ఆవిర్భవించాడు. పదునైన గోళ్లతో దుర్మార్గుడైన హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చాడు. ఆ తర్వాత ప్రసన్నమూర్తియై ప్రహ్లాదునిపైన ప్రేమను, వాత్సల్యాన్ని చూపి, ప్రకాశింపజేశాడు. అటువంటి శ్రీమన్నారాయణుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నాకు శరణు. ఆయనకు అనేకానేక భక్తిపూర్వక నమస్కారాలు!
అని మనసారా ప్రార్థించాడు యాదరుషి.
తపస్సు ఆరంభించడానికి సంకల్పించాడు..”
యాదర్షి కథను భక్తిపూర్వకంగా వివరిస్తున్నాడు బాల సంచారి. త్రిభువన మల్లుని రాజ మందిరంలో.. బాలుడైన భక్తుడు బాలసంచారి వివరిస్తున్న విధానానికి ముగ్ధులై, లీనమై వింటున్నారు.. చక్రవర్తి త్రిభువన మల్లుడు, రాణీ చంద్రలేఖ, యువరాజు సోమేశ్వరుడు, రామభట్టు!
అయితే కథ వింటూ.. వింటూ ఒక సందేహాన్ని లేవనెత్తాడు సోమేశ్వరుడు.

“బాల సంచారీ! యాదరుషి స్వామి దర్శనం కోసం తపస్సు చేద్దామనుకొన్నాడంటున్నావు. ఎలా చేయాలో, ఏ విధంగా ప్రారంభించాలో తెలియకుండానే అక్కడికి వచ్చాడా? మరి పుత్రుడిగా తను చేయవలసిన విధులు వొదిలేసి, తపస్సుకు సంకల్పిస్తే ఆయన తల్లిదండ్రులు ఊరుకొన్నారా? తన ధర్మం నెరవేర్చడం ముఖ్యమా? స్వామి దర్శనం తన ఒక్కడికే కావాలనే కోరికతో తపస్సు చేయడం ముఖ్యమా?”
సోమేశ్వరుడు వయస్సులో చిన్నవాడే అయినా, ఆలోచనల్లో మంచి పరిణతి ఉన్నవాడు. అందుకే ధైర్యం చేసి అడిగాడు.
ఆ ప్రశ్న విని నవ్వాడు బాల సంచారి.
“సోమేశ్వరా! నీవింకా చిన్నవాడివి! భోగానికి – యాగానికీ, అలాగే యాగానికీ – త్యాగానికీ నడుమ వ్యత్యాసం నీకు తెలియదు. తపస్సు అనేది ఎప్పటికీ స్వార్థం కాదు. తపస్సు ద్వారా సాధించిన ఫలితం.. అది తపస్సు చేసినవారికే స్వంతం కాదు. అసలు తపస్సు అంటే ఏమిటో తెలుసా?”
అడిగాడు బాల సంచారి.

“తెలుసు అని నేననుకొంటున్నాను. నాకు తెలిసింది ఎంతవరకు నిజమో, మీరు చెప్పింది విని సరిచూసుకొంటాను..” అంటూ సోమేశ్వరుడు సమాధానం చెప్పాడు.
“సోమేశ్వరా! తపస్సు గురించి నీకు ఎంత తెలుసో, ఏమి తెలుసో నాకు తెలియదు. కానీ, తపస్సు చేయడం అంటే, తపః ఫలాన్ని సాధించడం అంటే.. మామూలు విషయం కాదు. జీవించి ఉండగానే.. ఈ జీవితాన్ని వదులుకోవడం. వద్దనుకోవడం! కోపతాపాలను, కోరికలను, అహంకారాన్ని, మమకారాన్ని మరిచిపోవడం. ఇది చెప్పినంత సులభం కాదు. మాటల్లో చెప్పేటంత చిన్న విషయమూ కాదు”
తీవ్రంగా పలికాడు బాల సంచారి.
ఆ మాటలకు సోమేశ్వరుడు పరిహాసపూర్వకంగా నవ్వాడు.
“బాల సంచారీ! నీ మాటలు నాకు వింతగా తోస్తున్నాయి. లేనిదాన్ని ఏదైనా సాధించడం గొప్పకానీ, ఉన్నదాన్ని వదులుకోవడం, వద్దనుకోవడం.. ఏం గొప్ప!” అన్నాడు
సోమేశ్వరుడు.
ఆ మాటలు, ఆ అజ్ఞానం చూసి కొంత అసహనం కలిగింది బాల సంచారికి.
ఇద్దరి వాదం వింటున్న త్రిభువన మల్లుడు ఆలోచనలో పడ్డాడు.
‘ఇద్దరూ చిన్న పిల్లలే. పదేండ్ల వయస్సున్న పసిపిల్లలే. కానీ, ఒకడు ప్రకృతిలో పెరిగాడు. ఇంకొకడు రాజ భవనంలో పెరిగాడు. ఇద్దరి భావాలమధ్య పెద్ద వైరుధ్యమే ఉంది.. ఉంటుంది’.
రాణీ చంద్రలేఖకూడా సోమేశ్వరుని మాటలకు అభ్యంతరం చెప్పింది.
“నాయనా సోమేశ్వరా! బాల సంచారి సామాన్యుడు కాదు. ఒక మహాత్ముడైన మహర్షికి శిష్యపరంపరలోని వాడు. జ్ఞానం సముపార్జించినవాడు. అలా ప్రశ్నించడం మంచిదికాదు”
“సందేహం కలిగితే, ప్రశ్నించడం తప్పా అమ్మా!” అడిగాడు సోమేశ్వరుడు.
“ప్రశ్నించడం తప్పుకాదు సోమేశ్వరా! మనం అడిగే ప్రశ్న.. సమాధానం తెలుసుకోవడానికి అయితే ఫరవాలేదు. కానీ, ఎదుటి వ్యక్తిని హేళన చేయడానికి, అతని తెలియనితనాన్ని బయట పెట్టాలనే అహంకారంతోనో.. అడిగితే దాన్ని ప్రశ్నించడం అనరు. మన అజ్ఞానంతో ఎదుటివారిని బాధ పెట్టడం అంటారు” స్పష్టంగా చెప్పింది చంద్రలేఖ.
“రాణీ, నువ్వన్నది నిజమే! సోమేశ్వరుని మాటల్లో కొంత పరిహాసం ఉన్నట్టు నాకు అనిపించింది” అన్నాడు త్రిభువనుడు.
ఆ మాటలు వింటూనే.. “ప్రభువులు మన్నించాలి! యువరాజు సోమేశ్వరులవారు అడిగింది తప్పుకాదు. తపస్సు గురించి తెలిసిన వాళ్లకు పూర్తిగా తెలుసుకానీ, తెలియనివారికి అదేదో ఏకాంతవాసం అనిపిస్తుంది. బాల సంచారి ఈ సందేహానికి సరైన సమాధానం చెప్పగలడనే నమ్మకం నాకు ఉంది” అన్నాడు రామభట్టు వినయంగా.
అందరు చెప్పిందీ విన్నాడు బాల సంచారి.
తనలో తను నవ్వుకొన్నాడు.
అందరిముందూ తన గురించి నవ్వుకోవడాన్ని సోమేశ్వరుడు సహించలేకపోయాడు. తల్లి అయినా, తండ్రి అయినా తనది అజ్ఞానమనీ, అహంకారమనీ అంటే.. తను తట్టుకోలేడు.
“నాది అజ్ఞానం కాదు. అహంకారం కాదు. తెలియని విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి.. అంతే” కోపంగా అన్నాడు సోమేశ్వరుడు.
ఈ అవిధేయత చూసి, త్రిభువన మల్లుడికి ఆగ్రహం కలిగింది. ఒక పక్కన బాల సంచారి అంత వివరంగా యాదరుషి గురించి, ఆ మహాత్ముడు సంకల్పించిన తపస్సు గురించి అంత ఉదాత్తంగా వివరిస్తుంటే.. ఇంకా తన కుమారుడు అర్థం చేసుకోకపోవడం ఏమిటి?
“సోమేశ్వరా! నీది అహంకారం కాదు అంటున్నావ్‌. కానీ, నేను సర్వసంగ పరిత్యాగిగా దీక్ష తీసుకొంటానంటే, స్వామివారి ప్రత్యక్ష సేవకుడిగా మారిపోతానంటే.. నువ్వేమన్నావ్‌? ‘అమ్మ అందుకు అనుమతించినా, నేను ఒప్పుకోను’ అన్నావ్‌. అంటే, తండ్రిగా, ఒక సామ్రాట్టుగా నేను తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకించే దుస్సాహసం చేశావ్‌. మరి, దానినేమంటారు?” కాఠిన్యం పలికింది త్రిభువనుడి స్వరంలో..
“అది అవిధేయత కాదు నాయనగారూ! మీ ఎడబాటును తట్టుకోలేని బాధ. ఆత్మీయత. మీరు కనుల ముందు లేకుండా ఎక్కడో ఉంటే, నేనూ.. అమ్మా మిమ్మల్ని చూడలేకపోయిన భావనలో సంతోషాన్ని కోల్పోతాము. జీవించి ఉన్నా, మీరిక్కడ లేరు, ఉండరు.. అన్న భావన మమ్మల్ని జీవచ్ఛవాలుగా మార్చేస్తుంది. అందుకే అలా అన్నాను. మిమ్మల్ని వొదిలిపెట్టి ఉండలేనన్నాను తప్ప, మీ నిర్ణయాన్ని వ్యతిరేకించి కాదు. తండ్రిగా మీరు అర్థం చేసుకోగలరనుకొంటున్నాను” వినయంగా పలికాడు సోమేశ్వరుడు.

“మమ్మల్ని వొదిలిపెట్టి వెళ్లొద్దన్నావు సరే.. నీవు నా బదులుగా స్వామి సేవకు అంకితం కాగలవా? ఈ రాజమందిరం వొదిలి, కొండపైన ఒంటరిగా ఉండగలవా..? నా కోసం” అన్నాడు త్రిభువనుడు.
ఈ సంభాషణ ఎటుపోయి ఎటు వస్తుందో అర్థంకాక, అయోమయ స్థితిలో ఉన్న చంద్రలేఖ.. గభాల్న తన కొడుకును దగ్గరకు తీసుకొని, గుండెలకు హత్తుకొంది.
“ఏమిటి ప్రభూ! ఈ మాటలు? నా చిన్నారిని వదిలిపెట్టి నేనుండగలనా? నన్ను, మిమ్మల్ని వదిలిపెట్టి వాడు మాత్రం జీవించి ఉండగలడా? అంతుపట్టని వ్యాధితో, చావుకు దగ్గరగా వెళ్లిన నా బిడ్డకు నారసింహుడే వైద్యుడై, మళ్లీ ప్రాణం పోశాడు. తన దయతో, అపూర్వమైన అనుగ్రహంతో తల్లీబిడ్డలు వేరు కాకుండా చూశాడు. నా కుమారుడు నాకు దక్కకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతానని ఆనాడే మీకు చెప్పాను. అటువంటిది మళ్లీ నా బిడ్డ నా దగ్గర లేకుండా దూరంగా వెళ్లిపోతే నేను మాత్రం ఇక్కడ సంతోషంగా ఉండగలనా? అసలు జీవించి ఉండగలనా?” దుఃఖం ఆమె స్వరాన్ని వణికిస్తున్నది.
అమ్మ అలా మాట్లాడ్డం చూసి తట్టుకోలేక పోయాడు సోమేశ్వరుడు. తల్లిని గట్టిగా పట్టుకొన్నాడు.

“అమ్మా! దేవుడైనా నాకు అమ్మకంటే ఎక్కువ కాదు. అమ్మ – నాయనల దగ్గర ఉండకుండా.. ఇంకోచోట నేనుండలేను. నాయనగారూ! నన్ను క్షమించండి!” తల్లి కన్నీరు చూసి, తనూ కన్నీరు పెట్టుకొన్నాడు సోమేశ్వరుడు.
కొద్దిసేపు క్రితమే, గొప్ప జ్ఞానిలాగా పెద్ద మాటలు చెప్పిన తన కుమారుడు.. ఇప్పుడే తల్లి చంకలోనున్న బిడ్డలా మారిపోవడం చూసి ఆశ్చర్యం కలిగింది త్రిభువనుడికి.
తల్లిని, తండ్రిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని కుమారుడు.
కొడుకు వదిలిపెట్టి వెళ్లిపోతే, ప్రాణాలు కూడా తీసుకొంటానన్న తల్లి!
చూసి నవ్వుకొన్నాడు బాల సంచారి.
మనసులోనే సద్గురువులకు ప్రణామం చేశాడు.
“ మనసశ్చేంద్రియాణాం చ ఐకాగ్య్రం తమముచ్యతే
తజ్జ్యయ స్సర్వధర్మేభ్యస్సధర్మః పర ముచ్యతే!
.. అంటే మనస్సును, ఇంద్రియములను స్వీయ నియంత్రణలో ఉంచి పరమాత్మునిపై దృష్టి నిలుపడమే.. ఉత్తమమైన తపస్సు!
సమస్త ధర్మములలో ఈ తపోరూపమైన ధర్మమే గొప్పది. నిజమైంది కూడా.
అర్థమైందా నీకు?”
సోమేశ్వరుడిని అడిగాడు బాల సంచారి.

‘అర్థం కాలేదు’ అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు సోమేశ్వరుడు.
“ఇందాక నువ్వేమన్నావు? యాదరుషి తపస్సును సంకల్పించాడు అంటే.. నువ్వు నన్ను హేళనగా ప్రశ్నించావు. ‘తపస్సు చేయాలంటే ఉన్నదాన్ని వదులుకోవాలి’ అని నేనన్నాను. అప్పుడు నువ్వన్నావు.. ‘నీ మాటలు నాకు వింతగా తోస్తున్నాయి. లేనిదాన్ని సాధించడం గొప్ప కానీ, ఉన్నదాన్ని వదులుకోవడం ఏమంత గొప్ప విషయం’ అని!”
“అవును.. అన్నాను”
“మరి ఇప్పుడేమో అమ్మను వదిలిపెట్టి ఉండలేను, నాయనగారిని చూడకుండా ఒక్క క్షణం కూడా జీవించలేను అంటున్నావు. నువ్వు లేనిదాన్ని సాధించాలనుకోవడం లేదు. ఉన్నదాన్ని వదులుకోలేనంటున్నావు. అర్థమైందా నీకు? బంధాలను వదులుకోవడం ఎంత కష్టమో! ఎంత బాధాకరమో! ఎంత అసాధ్యమో..” బాల సంచారి మాటలు అక్కడున్న అందర్నీ ఎంతగానో ఆలోచింపజేశాయి.
సోమేశ్వరుడు బదులు చెప్పలేక తల వంచుకొన్నాడు.

“మా ఆదిగురువు యాదరుషికీ అంతకుముందు బంధాలు ఉన్నాయి. కనిపెంచిన తల్లి ఉంది. ఒడిలో కూర్చోబెట్టుకొని విద్యాబుద్ధులు నేర్పిన కన్నతండ్రీ ఉన్నాడు. అమ్మా, నాయనల సాంగత్యంలో, సాన్నిహిత్యంలో తనదైన ప్రపంచంలోనే బుడిబుడి అడుగులు వేస్తూ.. తల్లిదండ్రుల ఆలనా పాలనలో, హాయిగా, ఆనందంగా పెరిగినవాడే కదా యాదరుషి. మరి, ఆ మహాత్ముడు తన బంధాలను ఎలా వదులుకోగలిగాడు? అన్నీ వొదిలేసి నారసింహుడి కోసం నరసంచారం లేని అడవిలో, కొండపైన ఒంటరిగా తపస్సును ఎలా కోరుకొన్నాడు.? చలికీ, ఎండకూ, వర్షానికీ, క్రూరమృగాల విశృంఖల సంచారాన్ని ఎలా తట్టుకొన్నాడు? అదే సంకల్పం అంటే! అదే భక్తి అంటే! అదే సాధన అంటే! సాధకుడు ఎట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తన సాధన విడువడు. సాధించాలనుకొన్న కార్యాన్ని తప్ప.. ఇంకోదాన్ని ఆలోచించడు. తపస్సు అంటే ముక్కు మూసుకొని, కనులు మూసుకొని ఈ ప్రపంచాన్ని మరిచిపోవడం కాదు. లోక క్షేమాన్ని వదిలి, స్వార్థాన్ని ఆశ్రయించడం కాదు. అందరి క్షేమం కోసం, లోకంలో శోకాన్ని తొలగించడం కోసం ఎవరూ చేయలేని పనిని తలకెత్తుకొని, తానొక్కడే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, భగవంతున్ని మెప్పించి ఆ అనుగ్రహ ఫలితాన్ని పదిమందికీ పంచేవాడే తాపసి! మహర్షి! యాదరుషి!..” అంటూ తన వాక్‌ ప్రవాహాన్ని కొనసాగించాడు బాలకుడు.

“సందేహం కలిగితే, ప్రశ్నించడం తప్పా అమ్మా!” అడిగాడు సోమేశ్వరుడు. “ప్రశ్నించడం తప్పుకాదు సోమేశ్వరా! మనం అడిగే ప్రశ్న.. సమాధానం తెలుసుకోవడానికి అయితే ఫరవాలేదు. కానీ, ఎదుటి వ్యక్తిని హేళన చేయడానికి, అతని తెలియనితనాన్ని బయట పెట్టాలనే అహంకారంతోనో.. అడిగితే దాన్ని ప్రశ్నించడం అనరు. మన అజ్ఞానంతో ఎదుటివారిని బాధ పెట్టడం అంటారు” స్పష్టంగా చెప్పింది చంద్రలేఖ. “నిజమే! సోమేశ్వరుని మాటల్లో కొంత పరిహాసం ఉన్నట్టు నాకు అనిపించింది” అన్నాడు త్రిభువనుడు.

“మా ఆదిగురువు యాదరుషికీ అంతకుముందు బంధాలు ఉన్నాయి. కనిపెంచిన తల్లి ఉంది. ఒడిలో కూర్చోబెట్టుకొని విద్యాబుద్ధులు నేర్పిన కన్నతండ్రీ ఉన్నాడు. అమ్మా, నాయనల సాంగత్యంలో, సాన్నిహిత్యంలో తనదైన ప్రపంచంలోనే బుడిబుడి అడుగులు వేస్తూ.. తల్లిదండ్రుల ఆలనా పాలనలో, హాయిగా, ఆనందంగా పెరిగినవాడే కదా యాదరుషి”.

అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana