e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home చింతన ఆదర్శమే దైవత్వం

ఆదర్శమే దైవత్వం

రాముడు మర్యాదాపురుషోత్తముడు. ఆదికవి వాల్మీకి ఆదర్శ మానవుడికి ప్రతీకగా శ్రీరాముడిని తీర్చిదిద్దారు. మనిషిగా వచ్చిన దేవుడు సమస్త మానవజాతికి చెరిగిపోని మార్గాన్ని ఎలా నిర్దేశించారో సూచించారు. ఈ విషయాన్ని బలపరిచే సందర్భాలు ఎన్నో రామాయణంలో కనిపిస్తాయి.లంకానగరంలోని అశోకవనంలో సీతాదేవిని దర్శించాడు హనుమ. ఆ సాధ్వి రామచంద్రుడి కుశలమడుగుతూ హనుమను ఇలా ప్రశ్నించింది.

కచ్చిదాశాస్తిదేవానాం ప్రసాదం పార్థివాత్మజః
కచ్చిత్‌ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే (సుందరకాండ 36-19)

- Advertisement -

‘రాజకుమారుడైన రాముడు దేవతల అనుగ్రహాన్ని కోరుతున్నాడు కదా! పురుషకారానికీ (మానవ ప్రయత్నం), దైవబలానికీ సమానమైన ప్రాధాన్యం ఇచ్చి వాటిని సమంగా సేవిస్తూ ఉన్నాడు కదా’ అని హనుమను ప్రశ్నించింది సీతమ్మ.
ప్రశ్నగా చూస్తే ఇందులో భర్త గురించి ఓ భార్య పడే ఆరాటంగా అనిపిస్తుంది. శ్రీరాముడి దినచర్యను గమనించిన సీతమ్మకు రాముడు చేసే దైవారాధన గురించి తెలుసు. ‘తాను దూరమయ్యాక రాముడు శోకంలో మునిగిపోయి తననే తలచుకొని దుఃఖిస్తూ దేవతారాధన విస్మరించలేదు కదా!’ అని సీతమ్మ పడే తపన మాత్రమే కనిపిస్తుంది. కానీ, లోతుగా చూస్తే, విష్ణుమూర్తి అవతారమైన రాముడు దేవతానుగ్రహాన్ని కోరి, భక్తిపూర్వకంగా అర్చనలు చేసేవాడని తేటతెల్లమవుతుంది.
ఇక్ష్వాకు వంశ ప్రభువులకు శ్రీరంగనాథస్వామి ఇలవేలుపు. సూర్యవంశపు రాజులు కాబట్టి ఆదిత్యుడిని కూడా ప్రధానంగా ఆరాధించేవారని భావించవచ్చు. రాముడి దగ్గరికి వచ్చేసరికి, ఆయన మహావిష్ణువు అవతారమన్నది తెలిసిందే. తానే దేవుడై ఉండి మళ్లీ దేవతలను ప్రార్థించడం దేనికి? రాముడిని దేవుడిగా కాదు, మహోన్నతమైన మానవుడిగా చిత్రించాడు వాల్మీకి. ప్రతి మనిషీ దైవాన్ని విశ్వసించాలి, ప్రార్థించాలన్నది ఆదికవి ఆంతర్యం. అవతారపురుషుడికైనా ఇందులో మినహాయింపు లేదు. వాల్మీకి హృదయం, రాముడి నడవడి, జానకీదేవి ఆకాంక్ష లోకానికి ఆదర్శం.
బాలకాండలోనూ రాముడు చేసిన అనుష్ఠానం గురించి ప్రస్తావన ఉంది. యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుడి వెంట బయల్దేరారు రామలక్ష్మణులు. రాత్రి ఒకచోట విశ్రమించారు. మర్నాడు
తెల్లవారగానే, విశ్వామిత్రుడే స్వయంగా..


కౌసల్యా సుప్రజారామాపూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ! నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికం (బాలకాండ 23-2)

అని ప్రస్తుతించాడు. ‘ఉదయ సంధ్యా సమయం అవుతున్నది రామా! మేలుకో! దైవారాధన చేయవలసి ఉన్నద’ని కదా దీని భావం. బాలరాముడిగా ఉన్నప్పటినుంచే శ్రీరాముడు నిత్యం దైవారాధన చేసేవాడని తెలుస్తున్నది. ‘నేను దేవుణ్ని’ అని ఎన్నడూ భావించలేదు రాముడు. అలా అనుకోవడం సీతమ్మకూ ఇష్టం కాదు. ‘నేను తోడుగా ఉన్నప్పుడు చక్కగా దేవతారాధన చేసేవాడు, నా వియోగంతో దిక్కుతోచని వాడై కర్మభ్రష్ఠుడై, భక్తిహీనుడై చతికిలపడుతున్నాడా! అన్నీ మానేసి దైవాపరాధం చేస్తున్నాడా!’ అని సీతమ్మ అభివ్యక్తీకరించింది. రాముడు తన వియోగంతో శోకంలో మునిగిపోయి భగవదారాధనను మానేస్తే అందుకు కారణం తాను అవుతానని సీతమ్మ అనుమానం. అందుకే తన భర్త దైవసేవ కొనసాగిస్తున్నాడా అని ప్రశ్నించింది.
దేవతానుగ్రహం పొందడం మానవుడి కర్తవ్యం. పరిస్థితులు ఎలా ఉన్నా దానిని విస్మరించకూడదు. రాముడంతటివాడే దైవాన్ని విశ్వసించాడు. ఎన్నడూ తాను గొప్పవాడిననే భావనకు లోనవ్వలేదు. రాముడు తన శక్తియుక్తులకు, దైవానికి సమప్రాధాన్యం ఇచ్చి వాటిని సేవిస్తూ ఆదర్శంగా నిలిచాడు. సాధకుడు సైతం వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. మాయాతీతుడైన దైవాన్ని విస్మరించి, తానే అధికుడని భావించిన మనిషి మాయలో పడి, పతనమవ్వడం తథ్యం.

డాక్టర్‌ వెలుదండ సత్యనారాయణ
94411 62863

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana