ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

Fri,November 8, 2019 08:48 PM

కొండమల్లేపల్లి: వివాహబంధానికే మచ్చ తెచ్చింది ఓ మహిళ. ప్రియుడిని మర్చిపోలేక భర్త అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతచెట్టు తండాలో గత నెల 29న జరిగిన హత్యోదంతం వివరాలు శుక్రవారం సీఐ శ్రీకాంత్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. చింతచెట్టు తండాకు చెందిన నేనావత్ రమేశ్(25), స్వప్న దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. రమేశ్‌తో పాటు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బొంత నాగేంద్రబాబు అలియాస్ నాగరాజు అపార్ట్‌మెంటులో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రమేశ్ భార్యకు నాగేంద్రబాబుకు ఏర్పడిన పరిచయం శారీరక బంధానికి దారితీసింది. విషయం తెలిసి రమేశ్ తన భార్యను హెచ్చరించడంతో ఇరువురూ రహస్యంగా కలుస్తుండేవారు. భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో పథకం వేసింది. దీపావళి పండుగకు స్వగ్రామానికి రావడంతో మద్యం మత్తులో ఉన్న భర్తకు పెరుగులో మత్తు మాత్రలను కలిపి తిన్పించింది. రమేశ్ నిద్రలోకి జారుకోగానే ప్రియుడు నాగరాజుకు ఫోన్ చేసి తండాకు రప్పించుకుంది. స్వప్న రమేశ్ కాళ్లను పట్టుకోగా నాగరాజు వెంట తెచ్చుకున్న వైరు మెడకు బిగించి హతమార్చాడు. మద్యం మత్తులో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు జరిపించగా తండాకు చెందిన ఓ వ్యక్తి ఫొటో తీసి రమేశ్ గొంతుపై చిన్న గాటును గమనించి అనుమానం వ్యక్తం చేశాడు. మరోవైపు మృతుడి సోదరుడు నరేశ్.. స్వప్న ప్రవర్తనలో తేడా గమనించి ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్యోదంతం వెలుగుచూసింది. నిందుతులిద్దరినీ శుక్రవారం కోర్టుకు రిమాండ్ చేశారు.

5176
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles