రెంజల్: ఓ తల్లి పసిబిడ్డతో సహా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన గోదావరి నది ఒడ్డున జరిగింది. వివరాల్లోకెళ్తే.. రెంజల్ మండలం, తాడ్ బిలోలి గ్రామానికి చెందిన ఉషా కోహిల రూప(22) అనే వివాహిత, తన చిన్న బాబును తీసుకొని గోదావరి నదిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన గంగ పుత్రులు.. వెంటనే స్పందించి ఆమెను రక్షించి, ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాసర ఎస్ ఐ రాజు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆత్మహత్య యత్నానికి భర్తే కారణమని ఆమె వివరించినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్బంగా ఆమెకు హామీ ఇచ్చారు.