తల్లి విషం తాగి ఆపై కొడుకులకు..

Wed,July 17, 2019 07:55 AM

mother consumed poison committed suicide

మెట్టుగూడ : సికింద్రాబాద్ పార్శిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక ఓ భార్య తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి తానూ తాగింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా పెద్ద కొడుకు క్షేమంగా ఉన్నాడు. చిన్న కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పార్శిగుట్టలో వడ్ల ప్రసాద్(34) తన భార్య వడ్ల అంజలి(28)తో పాటు అనిరుధ్(10), అమృత్(8) కుమారులతో నివాసం ఉంటున్నారు.

ప్రసాద్ కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, అంజలి ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా ప్రసాద్ గత కొన్ని నెలల నుండి మద్యానికి బానిసై ఇంట్లో భార్య పిల్లలతో గొడవకు దిగేవాడు. వేధింపులు భరించలేక అంజలి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో గత నెల 15న ఫిర్యాదు చేయగా ఇరువురికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ప్రసాద్ తన తీరును మార్చుకోకపోవడంతో పాటు భార్యపై అనుమానం పెంచుకుంటూ ఇంటికి రాకుండా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్ నుండి తిరిగి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం ఫోన్ వచ్చింది. తాను స్కూల్‌కు వెళ్లానని, ఇప్పుడు రావడం కుదరదని చెప్పింది. కాగా ప్రసాద్ కౌన్సెలింగ్ వద్దకు వెళ్లాడు.

అంజలి వెళ్లకుండా తన ఇద్దరు పిల్లలతో ఇంటివద్దే ఉంటూ మధ్యాహ్నం సమయంలో కూల్‌డ్రింక్ తీసుకొచ్చి అందులో విషం కలిపి పిల్లలతో పాటు తాను తాగింది. అదే సమయంలో పెద్దకుమారుడు అనిరుధ్ వాంతులు చేసుకున్నాడు. ఇంట్లో అప్పటికే తన తల్లి, తమ్ముడు అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో వెంటనే తన ఇంటి ఓనర్‌కు చెప్పాడు. దీంతో హుటాహుటిన స్థానికులతో కలిసి సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించిందని, గాంధీ దవాఖానకు తరలించాలని సూచించారు. గాంధీలో చికిత్స పొందుతూ అంజలి మృతి చెందగా చిన్న కుమారుడు అమృత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అంజలి తల్లి కమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1292
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles