వ్యక్తి దారుణ హత్య

Thu,October 17, 2019 08:52 PM

మిర్యాలగూడ రూరల్‌: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేసి హత్యచేసిన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామశివారులో గురువారం చోటు చేసుకుంది. రూరల్‌ సీఐ రమేష్‌ బాబు తెలిపిన వివరాలు.. కిష్టాపురం గ్రామానికి చెందిన మల్గిరెడ్డి శివారెడ్డి (40) గురువారం ఉదయం గ్రామ శివారులో అద్దంకి-నార్కట్‌పల్లి రోడ్డు వెంట ఉన్న తన పొలానికి వెళ్లాడు. పని ముగించుకొని రోడ్డుపై నిలిపి ఉంచిన తన ట్రాక్టరు వద్దకు రాగానే బైకుపై ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడి వద్ద ఆగారు. దాహం వేస్తుంది నీరు కావాలంటూ అడగగా.. అతను వారి చేతికి నీళ్ల క్యాన్‌ ఇచ్చాడు. నీరు తాగి తిరిగి అతడికి క్యాన్‌ ఇచ్చిన దుండగులు తమ వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో శివారెడ్డిపై దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమీప పొలంలో పని చేస్తున్న మృతుడి సోదరుడు వారిని అడ్డుకునేందుకు యత్నించగా మారణాయుధాలతో బెదిరించి పరారయ్యారు. శివారెడ్డికి సమీప బంధువులతో భూ వివాదం నడుస్తుందని, ఇదే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.

1983
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles