తాగిన మైకంలో అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు

Thu,June 21, 2018 09:59 PM

Man allegedly lights uncles home on fire


ముథోల్: భార్య కాపురానికి రావడం లేదని తాగిన మైకంలో అత్తారింటికి నిప్పు పెట్టిన సంఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ముక్తాదేవి గల్లీకి చెందిన రోళ్ల మారుతి అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మిని పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. మారుతి తాగుడుకు బానిస కావడంతో వీరి కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్య తన పిల్లలతో ఇదే గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. మారుతి బుధవారం రాత్రి తాగిన మైకంలో అత్తారింటికి వెళ్లి గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు.

గురువారం వేకువజామున అత్తారింటి పైకప్పును తొలగించి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం భార్య, పిల్లలు, అత్తామామలు నిద్రిస్తున్న మరో గది తలుపు సందులోంచి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నిద్రిస్తున్న భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు ఈశ్వర్, మల్లేశ్, అత్త కళ, మామ చిన్నలింగన్న అరవడంతో చుట్టు పక్కల వారు ఇంటి తలుపులు తొలగించి వారిని కాపాడారు. ఇదే అదునుగా భావించి మారుతి కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. నిప్పు పెట్టే క్రమంలో మారుతికి కూడా గాయాలయ్యాయి.

గాయపడ్డ వారిని 108లో దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ముథోల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై భరత్ సుమన్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలను స్థానికులను అడిగితెలుసుకున్నారు. నిందితుడు మారుతి కూడా గాయాలపాలు కావడంతో స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

4131
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles