దొంగను కిడ్నాప్‌చేసి.. సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు

Wed,April 10, 2019 10:03 AM

Hyderabad Police crack kidnap case

వెంగళరావునగర్: డబ్బుల కోసం జేబు దొంగను కిడ్నాప్‌చేసి, అనంతరం అతని బావమర్ధిని కూడా బంధించి చిత్రహింసలకు గురిచేసి భారీగా డబ్బులు వసూలు చేశారు... కిడ్నాపర్లనుంచి విడుదలైన బాధితుడి ఫిర్యాదుతో ఎస్సార్ నగర్ పోలీసులు రంగంలోకి దిగి 9 మంది కిడ్నాపర్లను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.18 లక్షలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, క్రైం ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. ఎస్సార్ నగర్‌కు చెందిన వెంకటయ్య జేబు దొంగ. ఇతనిపై సుమారు 40కి పైగా జేబుదొంగతనాల కేసులు ఉన్నాయి.

కాగా..నిజామాబాద్ జిల్లాకు చెందిన పిట్ల శంకర్(52), కొల్లి సాయికృష్ణ(32), గైక్వాడ్ రాజారాం(37), పిట్ల రవి(26), అబ్దుల్ హమీద్(37), పంజల సాయికృష్ణ(23), షేక్ అన్వర్(34), గుర్రం కల్యాణ్(23)లు ముఠాగా ఏర్పడ్డారు. వీరికి జేబుగొంగ వెంకటయ్య వద్ద భారీగా డబ్బులు, బంగారం ఉన్నదని సమాచారం అందింది. అతన్ని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 2న మారుతీ ఎర్టిగా, టాటా జెస్ట్ కార్లలో వచ్చి వెంకటయ్యను కిడ్నాప్ చేశారు. మొదట యాదగిరిగుట్టకు తీసుకువెళ్లి గౌడ ట్రస్ట్ భవన్ అనే లాడ్జిలో బంధించారు.

శరీరంపై సిగరెట్‌తో కాల్చి చిత్రహింసలకు గురిచేసి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తెప్పించాలని ఒత్తిడి చేశారు. అక్కడి నుం చి తుక్కుగూడు, అక్కడి నుంచి భువనగిరి ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే నివసించే వెంకటయ్య బావమర్ది నాగయ్యను పిలిపించి నిర్బంధించి తీవ్రంగా హింసించారు. వారి చిత్రహింసలకు తాళలేక బాధితులు వెంకటయ్య, నాగయ్యలు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రూ.18 లక్షల నగదు, 7.50 తులాల బం గారు ఆభరణాలు తీసుకువచ్చి కిడ్నాపర్లకు అందజేశారు. దీంతో బాధితులను 5న వదిలిపెట్టారు. 6న బాధితుడు వెంకటయ్య తీవ్ర గాయాలతో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల్లో 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

హిజ్రాల వేషంలో దోపిడీ : ముగ్గురు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకు చెందిన కొండపల్లి జంగయ్య(33), కప్పరి జంగయ్య (28), కొండపల్లి రంగప్ప(69) హిజ్రాల వేషధారణతో అమీర్‌పేట, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఒంటరిగా కనిపించేవారిని డబ్బుల కోసం వేధిస్తున్నారు. ఈ నెల 6న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుబ్రమణ్యేశ్వర్‌రెడ్డి ఎస్సార్ నగర్‌లో బస్సు దిగగానే హిజ్రాల వేషంలో ఉన్న వీరు అతన్ని చుట్టుముట్టారు. రూ. 10 ఇస్తుండగా తీసుకోకుండా పరుసులో ఉన్న రూ.4 వేలను లాక్కుపోయారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.

1921
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles