ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Sat,March 3, 2018 07:04 AM

husband killed by wife in balanagar

హైదరాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసి గుండెపోటుతో మరణించాడని చిత్రీకరించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

బాలానగర్ ఏసీపీ టీ గోవర్ధన్, సీఐ కిషన్‌కుమార్ కథనం ప్రకారం....ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, బాలాజీపేట మండలం, పనుకువలస గ్రామానికి చెందిన పెద్దింటి జగదీశ్వర్ (33)కు అదే ప్రాంతానికి చెందిన తులసి (24)తో 2012లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అనంతరం జగదీశ్వర్ తులసి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పంచశిలకాలనీ రంగారెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

కాగా జగదీశ్వర్ గాంధీనగర్‌లోని సావిత్రి సోలార్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. భార్య తులసి ఇంటి వద్దే ఉంటుంది. ఇదిలా ఉండగా సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, జగన్నాథపురం గ్రామానికి చెందిన చీమ వీరబాబు (26) పంచశీల కాలనీలోనే నివాసముంటున్నాడు. వీరబాబు, జగదీశ్వర్‌లు ఒకే ప్రాంతంలో నివాసముండటం, ఒకే పరిశ్రమలో పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. దీంతో వీరబాబు జగదీశ్వర్ ఇంటికి తరుచూ వస్తుండేవాడు.

దీంతో జగదీశ్వర్ భార్య తులసితో వీరబాబుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబందానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో రెండేండ్ల కిందట జగదీశ్వర్ తన భార్య తులసితో పాటు వీరబాబును మందలించాడు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. ఈ క్రమంలో కక్ష పెంచుకున్న భార్య తులసి, వీరబాబులు.. జగదీశ్వర్‌ను హతమార్చాలని పథకం పన్నారు. అనుకున్నట్లుగానే ఆచరణలో పెట్టడానికి ముహూర్తం ఖరారు చేశారు. గత నెల 24వ తేదీ రాత్రి డ్యూటీ నుంచి జగదీశ్వర్ ఇంటికి వచ్చాడు.

పథకం ప్రకారం వీరబాబు అర్ధరాత్రి జగదీశ్వర్ ఇంట్లోకి ప్రవేశించాడు. తులసి భర్త రెండుకాళ్లను గట్టిగా పట్టుకోగా వీరబాబు చున్నీతో జగదీశ్వర్ గొంతుకు గట్టిగా బిగించి చంపారు. 25 వ తేదీ ఉదయం ఇరుగుపొరుగువారితో తనభర్తకు గుండెపోటు వచ్చి మృతి చెందాడని తులసి చెప్పింది. అదేరోజు వీరబాబు కూడా డ్యూటీకి హాజరుకాలేదు. మృతుడి బంధువులు తులసిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తులో భాగంగా శుక్రవారం తులసిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది. తులసిని, వీరబాబును అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.

3636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles