ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌పై హిజ్రాల దాడి..పోలీసులకు గాయాలు

Wed,February 13, 2019 10:28 AM

Hijras Attacks On uppal police station

హైదరాబాద్: హిజ్రాల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వాహనదారులు, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులను, పాదచారులను అస్సలు వదలడంలేదు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఉప్పల్ రింగ్‌రోడ్డు సమీపంలో హిజ్రాలు విధ్వంసం సృష్టించారు. బస్‌స్టాప్‌లో కార్లు ఆపిన వారిపై దాడికి దిగి తీవ్రంగా కొట్టారు. అడ్డువచ్చిన వారిని కూడా కొట్టి.. వాళ్ల మెడలో ఉన్న బంగారు గొలుసులు, ఆభరణాలు, పర్సులను, మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. భయంతో సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు బాధితులు పరుగులు తీశారు. అంతటితో ఆగుకుండా పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్లి వీరంగం సృష్టించారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేస్తూ.. అడ్డు తగిలిన ముగ్గురు పోలీసులను కూడా తీవ్రంగా గాయపరిచారు.

సమయానికి ఎక్కువ మంది పోలీసులు అందుబాటులో లేకపోవడం, హిజ్రాలు భారీ సంఖ్యలో ఉండటంతో పరిస్థితి భయానకంగా మారింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఏసీపీ గాంధీ నారాయణపైకి దూసుకెళ్లి దాడికి యత్నించారు. వారు హద్దులు దాటి ప్రవర్తించడంతో పాటు కోపంతో ఊగిపోయారు. బూతులు తిట్టుకుంటూ.. నానా మాటలు అంటూ హంగామానే సృష్టించారు. తర్వాత స్టేషన్‌కు వచ్చిన సీఐ.. బాధితులు, గాయపడిన కానిస్టేబుళ్ల నుంచి ఫిర్యాదు తీసుకుని వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రికి బయలుదేరిన బాధితులను కూడా కొంత దూరం వెంబడించారు.

తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ దమనకాండ కొనసాగింది. ఈ ఘటనలో ఉప్పల్ పోలీసులు, బాధితులు ప్రదీప్‌రెడ్డి, రాంరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రదీప్‌రెడ్డికి చెందిన కారును పూర్తిగా ధ్వంసం చేశారు. రాంరెడ్డికి చెందిన మొబైల్ ఫోన్, బంగారు గొలుసు, పర్సులను హిజ్రాలు లాక్కున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హిజ్రాలు డబ్బులు ఇవ్వని వ్యక్తులపై దాడి చేయడం.. దూషించడం తరచుగా జరుగుతోంది. వారి వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

14700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles