భాగస్వామ్యం పేరుతో నిండా ముంచాడు

Sun,November 19, 2017 07:56 AM

Fraud in the name of partnership

హైదరాబాద్ : వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తే నిండా ముంచాడు. నగరంలోని పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హీరో నాగార్జున సోదరి నాగసుశీల (61) కొంత కాలంగా రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ వ్యాపారం చేస్తున్నారు. అప్పటికే ఆమె వద్ద మంతిని ప్రదోశ్ రాగ్ పనిచేస్తున్నాడు. 2005లో ప్రదోశ్ రాగ్‌తో ఉన్న పరిచయంతో శ్రీనగర్‌కాలనీలో భావరాజు టవర్స్ అపార్టుమెంటులో నివాసముండే చింతలపూడి శ్రీనివాస రావు, ప్రదోశ్‌రాగ్‌తో కలిసి నాగసుశీలను సంప్రదించాడు. వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించాలని, లాభాలు తెచ్చిపెడుతానని నమ్మబలికాడు. అతని మాటలను నమ్మిన నాగసుశీల 2005 జూలై 28న ఎస్‌ఎస్ అసోసియేట్స్ పేరుతో సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థకు శ్రీనివాసరావును మేనేజింగ్ పార్టనర్‌గా తీసుకున్నారు. ఆ మేరకు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిన్నమంగళారం వద్ద 34 ఎకరాల 38 గుంటలు కొనుగోలు చేశారు. ఎంతో నమ్మకంగా ఉంటున్నట్లు నటించిన శ్రీనివాసరావు నాగసుశీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే శ్రీనాగ్ ఎస్టేట్స్, శ్రీని నాగ్ కార్పొరేషన్, ఎస్‌ఆర్‌ప్రాపర్టీస్ తదితర సంస్థలకు తనకు తాను మేనేజింగ్ పార్టనర్ గా అవతారమెత్తి వాటన్నింటిపై బ్యాంకు అకౌంట్లు తెరిచాడు. అతని లావాదేవీల్లో భార్య చింతలపూడి సునీతను భాగస్వామ్యరాలిని చేశాడు. నాగసుశీలకు చెందిన కంపెనీల పెట్టుబడులను ఇతర వాటికి తరలిస్తూ సొమ్ము చేసుకున్నాడు. ఆలస్యంగా గ్రహించిన నాగసుశీల పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించగా, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస రావుపై 406, 420, 403, 409, 477(ఎ), 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

1092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles