రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి

Tue,October 22, 2019 09:38 PM

చంపాపేట: వచ్చే నెల 10న కుమారుడి వివాహం జరగనుంది. పెళ్లి పత్రికలకు కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తండ్రికుమారుడు బైక్‌పై బయలుదేరారు. పదిహేను రోజుల్లో ఇంట్లో పెళ్లిసందడి నెలకొననున్న నేపథ్యంలో అంతలోనే పెళ్లి కుమారుడు, తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హృదయ విదారక సంఘటన చంపాపేట డివిజన్‌లోని రెడ్డిబస్తీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్‌, రెడ్డిబస్తీలో దన్ని ప్రేమ్‌దాస్‌, అలియాస్‌ పెంటయ్య(60), కుమారుడు ముఖేష్‌(30)తో కలిసి నివాసముంటున్నారు. ప్రేమ్‌దాస్‌ భార్య కూడా నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో తండ్రి, కుమారుడు కలిసి ఉంటున్నారు. ప్రేమ్‌దాస్‌ వృతిరీత్యా సెంట్రింగ్‌ బాక్సుల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కుమారుడు ముఖేష్‌, రామంతాపూర్‌లో ఓ ప్రవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ముఖేష్‌కు ఇటీవల వివాహం నిశ్చయం కావడంతో పెళ్లిపత్రికలను తీసుకుని కొమురవెల్లి మల్లన్న దర్శనానికి తండ్రి ప్రేమ్‌దాస్‌తో కలిసి ముఖేష్‌ ద్విచక్రవాహనంపై మంగళవారం ఉదయం బయలుదేరారు. మార్గమధ్యలో మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేట సమీపంలో ముఖేష్‌ బైక్‌ అదుపుతప్పి పడిపోయింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రేమ్‌దాస్‌, ముఖేష్‌ మృతివార్త తెలిసిన వెంటనే బంధువులు, కాలనీవాసులు వారి నివాసానికి విచ్చేసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దాంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1953
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles