బాగోగులు చూసేవారు లేక..దంపతుల ఆత్మహత్య

Fri,November 8, 2019 06:52 PM

మహదేవపూర్(జయశంకర్ భూపాలపల్లి): వృద్ధాప్యంలో తమ బాగోగులు చూసుకునే వారేలేరనే మనస్తాపంతో వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ఎలికేశ్వరం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య(76), రాధమ్మ(66) దంపతులకు కుమారుడు రాళ్లబండి సత్తయ్య, ముగ్గురు కూతుళ్లు సమ్మక్క,అమ్మక్క,తిరుపతమ్మ సంతానం. వివాహం అనంతరం కొడుకు వేరు కాపురం పెట్టాడు. దీంతో వృద్ధ దంపతులిద్దరే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వయస్సు మీద పడడంతో ఆరోగ్యం సహకరించక వ్యవసాయ పనులు మానేసి ఇంటివద్దనే జీవిస్తున్నారు.


కాగా, ఇద్దరూ వృద్ధులు కావడంతో తమ బాగోగులు చూసే వారు లేరని తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఒక్కరోజు ముందే పురుగుల మందు డబ్బాతో పాటు నూతన వస్ర్తాలు కొనుగోలు చేసి ఆత్మహత్యకు ముహూర్తం పెట్టుకున్నారు. అంతేకాకుండా దహన సంస్కారాల ఖర్చులు ఎవరిమీద పడకుండా తమ వద్దే రూ.20వేలను ఉంచుకుని ఆత్మహత్యకు పాల్పడాలనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే శుక్రవారం ఉదయం తెల్లవారు జామున ఇంట్లో ఎవరూలేని సమయంలో 5 గంటలకు నూతన వస్ర్తాలు ధరించి వారు అనుకున్న సమయానికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. వృద్ధాప్యంలోనూ అందరితో కలిసిమెలిసి ఉంటూ కలివిడిగా మాట్లాడే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎలికేశ్వరం గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

2187
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles