అర్ధ సెంచరీకి పైగా చోరీలు

Wed,July 17, 2019 08:28 AM

Cops recover  gold,  cash from two burglars

హైద‌రాబాద్‌: రెండుసార్లు పీడీ యాక్టులు పెట్టినా బుద్ధి మారలేదు.. వ్యసనాలకు బానిసైన పాత నేరస్తుడు జైలు నుంచి బయటకు రాగానే మరో పాత నేరస్తుడితో కలిసి తాళం వేసిన ఇండ్లకు కన్నం వేసిన ఇద్దరు ఘరానా దొంగలను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు ఘరానా దొంగలు ఇప్పటి వరకు అర్ధసెంచరీకి పైగా చోరీలు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాలాపూర్, షాహిన్‌నగర్ కాలనీకి చెందిన సయ్యద్ మజీద్ అలియాస్ జహంగీర్‌పై బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సస్పెక్ట్ షీట్ కొనసాగుతున్నది. గతంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 40 దొంగతనాలు చేసి పట్టుబడ్డాడు. దీంతో 2015, 2017లో అతనిపై సిటీ పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు.

2018లో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చాంద్రాయణగుట్ట ప్రాంతంలో బ్రెడ్‌ ఆమ్లేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతనికి పహాడీషరీఫ్‌కు చెందిన పెయింటర్‌గా పని చేసే మహ్మద్ మోసిన్ అలీతో పరిచయం ఏర్పడింది. అతను గతంలో 11 దొంగతనాల కేసుల్లో జంట కమిషనరేట్ల పరిధిలో అరెస్టయ్యాడు. ఇదిలా ఉండగా, గత ఆరు నెలల నుంచి ఈ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. సయ్యద్ మజీద్ మద్యానికి బానిసై చేసే పనిలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో మోసిన్‌తో కలిసి దొంగతనాలు చేసేందుకు ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా ఈనెల 2వ తేదీన షాహిన్‌నగర్‌లో ఇద్దరు కలిసి మద్యం సేవించి, అక్కడి నుంచి టప్పాఛబుత్ర ప్రాంతానికి చేరుకొని ఆ ప్రాంతంలో తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను పరిశీలించారు.

ఈ క్రమంలోనే మోసిన్ ఫంక్షన్‌హాల్ సమీపంలో ఓ ఇంటికి తాళం వేసి ఉండడంతో, తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న 31 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదును అపహరించారు. ఇదిలాఉండగా, దొంగిలించిన సొత్తును సోమవారం నగరంలో విక్రయించే ప్రయత్నం చేస్తుండగా. విశ్వసనీయ సమాచారంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు బృందం ఇద్దరు పాత దొంగలను అదుపులోకి తీసుకున్నది. ఇద్దరిని విచారించి, వారి వద్ద నుంచి 24.6తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నది. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సైలు మల్లిఖార్జున్, భాస్కర్‌రెడ్డి, దుర్గారావులతోపాటు కానిస్టేబుల్ అధికారి ప్రవీణ్‌ను సీపీ అభినందించారు.

426
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles