పంజాగుట్టలో ఆటోడ్రైవర్ దారుణ హత్య

Mon,October 21, 2019 07:10 AM

*సోదరుడి హత్యకు ప్రతీకారం, రెక్కీ చేసి కత్తులతో దాడి
*బెయిల్ పై విడుదలైన పది రోజుల్లోనే హతం, ఆరు గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడిని జైలు నుంచి విడుదలైన పది రోజుల వ్యవధిలోనే ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ఘటన ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నాగార్జున హిల్స్‌లో ఉదయం 8.30 గంటల సమయంలో వాకింగ్ పూర్తి చేసుకొని చాయ్ తాగేందుకు ఆగిన ఒక వ్యక్తిని, ఓమినీ వ్యాన్‌లో వచ్చిన నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి విచక్షణా రహితంగా హత్య చేసి, అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన పరిసర ప్రాంతాల్లో ఘటన జరిగేందుకు గంట ముందు ఎవరెవరు అక్కడ తిరిగారు.. ఘటన జరిగిన సమయంలో ఎవరోచ్చారనే విషయాలను 24 సీసీ కెమెరాల నుంచి తీసిన ఫుటేజీలను విశ్లేషించి, నిందితులను ఆరు గంటల వ్యవధిలోనే గుర్తించి, ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విలేకరుల సమావేశంలో వివరించారు. జూన్ 26వ తేదీన ఆటో డ్రైవర్ మహ్మద్ అన్వర్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోనే హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఘటనలో నిందితుడైన పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌కు చెందిన రియాసత్ అలీ రిజ్వి అలియాస్ సుజ్జు(39) జైలుకు వెళ్లి, ఈనెల 10వ తేదీన బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చాడు. ఈ ఇద్దరు ఆటో డ్రైవర్లు స్నేహితులు. అయినా ఇద్దరి మధ్య ఆటో అడ్డా వద్ద ఏర్పడ్డ వివాదాలు హత్యల వరకు దారి తీశాయి. అన్వర్ హత్యతో అతని సోదరులు, కొడుకు ఇతర బంధువుల్లో కోపం పెరిగింది. దీంతో పాటు రియాసత్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఇతర కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి హత్య చేసే అవకాశాలున్నాయని అనుమానించారు.


ఎలాగైనా రియాసత్‌ను హత్య చేయాలని అన్వర్ సోదరుడు అబ్దుల్ రహమాన్(40), అతని కొడుకు మహ్మద్ అజార్(19), అల్లుడు సయ్యద్ అమ్జద్(22), దగ్గరి బంధువులు అబ్దుల్ అలీమ్(27), అహ్మద్ హసన్(20)లు ప్లాన్ వేశారు. దీంతో జైలు నుంచి విడుదలైన రియాసత్ కదలికలపై కన్నేశారు. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నాగార్జున హిల్స్‌లోని లక్ష్మీనర్సింహా చాయ్ దుకాణం వద్ద రియాసత్ చాయ్ తాగుతాడని గుర్తించారు. దీంతో చాయ్ దుకాణం వద్దనే అదును చూసి హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సనత్‌నగర్‌లో ఐదు కొబ్బరి బొండాలు కొట్టే కత్తులను కొనుగోలు చేయడంతోపాటు హత్య చేసేందుకు ఓమినీ వ్యాన్‌ను కూడా సమకూర్చుకున్నారు. పధకంలో భాగంగా ఆదివారం ఉదయం సూత్రధారి అబ్దుల్ రహమాన్ మృతుడు రియాసత్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు. ఇంటి నుంచి రియాసత్ బయటకు వెళ్లిన విషయాన్ని గమనించిన రహమాన్ వెంటనే మిగతా నలుగురికి ఫోన్ చేసి సిద్ధంగా ఉండాలని సూచించాడు. మిగతా నలుగురు ఓమినీ వ్యాన్(ఏపీ10 పీ 9054)లో చాయ్ దుకాణం వద్దకు చేరుకొని, అక్కడ ఉన్న రియాసత్‌పై కత్తులతో దాడి చేసి తలపై 12సార్లు నరకడంతోపాటు కాళ్లను కూడా నరికేశారు.

అయితే అక్కడునవారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు 108 అంబులెన్స్ తెప్పించి అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమావేశంలో డీసీపీ సుమతి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ సునీతారెడ్డి, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles