కోట్లకు పడగలెత్తిన ఏపీ చీఫ్ ఇంజినీర్Mon,April 17, 2017 03:38 PM

కోట్లకు పడగలెత్తిన ఏపీ చీఫ్ ఇంజినీర్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ జగదీశ్వర్‌రెడ్డి కోట్లకు పడగలెత్తారు. ఆదాయానికి మించి ఆస్తున్నాయన్న ఆరోపణలతో జగదీశ్వర్‌రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల నివాసాలపై మొత్తం 12 ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు మహబూబ్‌నగర్, సూర్యాపేట, విజయవాడ, చెన్నైతో సహా మరో ఎనిమిది ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. జగదీశ్వర్‌రెడ్డికి సంబంధించి కోట్ల రూపాయాలలో ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు జగదీశ్వర్‌రెడ్డిని అరెస్టు చేశారు.

హైదరాబాద్ డీడీ కాలనీలో విలువైన నివాసాలు, పంజాగుట్ట సమీపంలో 2,120 చదరపు గజాల నివాస స్థలాన్ని గుర్తించారు అధికారులు. ఈ స్థలం భార్య హైమావతి పేరిట ఉన్నట్లు గుర్తించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 4 వేల చదరపు గజాల్లో రెండు షాపింగ్ కాంప్లెక్స్‌లు.. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. మహబూబ్‌నగర్‌లోని అర్జికొల్లులో 5 వేల చదరపు గజాల నివాస గృహం, అమ్మపల్లిలో 2 వేల చదరపు గజాల నివాస గృహం ఉన్నట్లు గుర్తించారు. కుమార్తె ప్రియదర్శిని పేరిట హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేటలో జీప్లస్ 2 ఇళ్లు, 3,700 చదరపు గజాల్లో రూ. కోటి విలువైన జీ ప్లస్ ఇళ్లను గుర్తించారు అధికారులు.

మహబూబ్‌నగర్‌లోని అమ్మపల్లి, అర్జికొల్లు, మద్దిగంట్లలో 30.49 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 3.164 చదరపు గజాల్లో నివాస గృహం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండో కుమార్తె పేరిట మహబూబ్‌నగర్‌లో పదెకరాల వ్యవసాయ భూమి, మూడో కుమార్తె పేరిట మహబూబ్‌నగర్‌లో మరో పదెకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్‌లోని నివాస గృహంలో 250 గ్రాముల బంగారం, 10 కిలోల వెండిని గుర్తించారు ఏసీబీ అధికారులు. రూ. 12 లక్షలకు ఎఫ్‌డీలు, రూ. 83 వేల నగదు, ఐదు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా రూ. 5 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

1733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS