డీసీఎంను ఢీకొన్న బొలెరో.. ఇద్దరు మృతిSat,August 12, 2017 09:04 PM
డీసీఎంను ఢీకొన్న బొలెరో.. ఇద్దరు మృతి

జోగుళాంబ గద్వాల : జోగుళాంబ గద్వాల జిల్లా 44వ జాతీయ రహదారిపై బీచుపల్లి బస్టాప్ సమీపంలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

దినపత్రికలను గద్వాలకు చేరవేర్చే బొలెరో మాక్సి వాహనం హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున బయల్దేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా సి.బెలగల్ మండలం మాడులకు చెందిన హన్మంతు, ప్రభుదాస్, లక్ష్మిదేవి, శ్యామలలు హైదరాబాద్‌లో బొలెరో ఎక్కారు. అయితే ఆ వాహనం బీచుపల్లి స్టేజీ కర్నూల్ బస్టాప్ దాటిన తర్వాత రోడ్డుపక్కన నిలిపి ఉంచిన డీసీఎం కంటైనర్‌ను ఉదయం 6:35 నిమిషాల సమయంలో ఢీకొట్టింది.

అతివేగంతో కంటైనర్‌ను ఢీకొట్టడంతో బొలెరో మందుభాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ హన్మంత్, మందుభాగంలో కూర్చున్న ఏసురత్నం అక్కడికక్కడే మృతిచెందారు. వెనుకసీటులో ఉన్న ప్రభుదాస్, శ్యామల, లక్ష్మిదేవీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న హైవే సిబ్బంది, ఇటిక్యాల పోలీసులు ప్రభుదాస్‌ను హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదంలో సీట్ల మధ్య ఇరుకున్న శ్యామల, లక్ష్మిదేవిలను అతికష్టం మీద వెలికితీసి చికిత్స నిమిత్తం గద్వాల ఏరియా దవాఖానకు తరలించి, అటు నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌కు తీసుకెళ్లారు.

గద్వాల డీఎస్పీ బాలకోటి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వరావులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కాగా శ్యామల, లక్ష్మిదేవి అక్కా చెల్లెళ్లు, ప్రభుదాస్, ఏసురత్నంలు సడ్డకులు. వీరు హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. సొంతూరిలో హాస్టల్లో చదువుతున్న పిల్లలలకు సెలవులున్నాయని చూడ్డానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS