శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 16, 2020 , 15:32:08

మెడికల్‌ షాప్‌ ఎదుట యువకుడు మృతి.. కరోనా భయంతో దగ్గరకు రాని జనం

మెడికల్‌ షాప్‌ ఎదుట యువకుడు మృతి.. కరోనా భయంతో దగ్గరకు రాని జనం

భగల్‌ పూర్‌ : బిహార్‌ రాష్ర్టంలోని భగల్‌పూర్‌ అమానుష ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఓ యువకుడు మెడికల్‌ షాపుకు మందుల కోసం అని వచ్చి తిరిగి వెళ్తుండగా ఆకస్మాత్తుగా కింద పడిపోయి మృతిచెందాడు. కరోనా భయంతో అతడి మృతదేహాన్ని ఏ ఒక్కరూ ముట్టుకోలేదు. దీంతో సుమారు సుమారు 6 గంటల పాటు మృతదేహం అక్కడే ఉండిపోయింది.

స్థానికుల వివరాల ప్రకారం భగల్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల ఢిల్లీ నుంచి ప్రత్యేక రైలులో భగల్‌పూర్‌కు వచ్చాడు. అతడు కొద్ది రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. అతడికి ఆస్తమా ఉండడంతో బుధవారం మందులు కొనుగోలు చేయడానికి ఎంపీ ద్వివేది రోడ్డులోని ఓ మందుల దుకాణానికి వెళ్లాడు. ఇంతలోనే అతడికి ఆయాసం ఎక్కువై అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. కరోనా భయంతో అతడి మృతదేహాన్ని ఏ ఒక్కరూ తాకడానికి ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కొత్వాలి పోలీసులు అంబులెన్స్‌ పిలిపించి మృతదేహాన్ని తరలించాలని కోరగా కరోనా భయంతో డ్రైవర్‌ కుదరదని తేల్చి చెప్పాడు. 

దీంతో చేసేది లేక పై అధికారులకు సమాచారం అందించడంతో  సీనియర్‌ ఎస్పీ ఆశిశ్‌ భర్తీ, డీఎస్పీ రాజ్‌ సింగ్‌, కొత్వాలి ఎస్‌ఐ అమర్‌ విశ్వాస్‌తో  పాటు ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏ ఒక్కరూ మృతదేహం వద్దకు రాకపోవడంతో ఏఎస్పీ అభ్యర్థన మేరకు మున్సిపల్‌ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఘటనా స్థలానికి చేరుకోవడానికి సుమారు 6 గంటల సమయం పట్టింది. ఆ తరువాత మృతదేహాన్ని మెడికల్‌ షాప్‌ ఎదుట నుంచి తరలించారు. అనంతరం యువకుడి మృతదేహం నుంచి నమూనాలు సేకరించి కరోనా పరీక్షలకు పంపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo