బుధవారం 20 జనవరి 2021
Crime - Nov 22, 2020 , 20:08:55

స్కూటర్‌ అదుపుతప్పి యువకుడు దుర్మరణం.. ఇద్దరి పరిస్థితి విషమం

స్కూటర్‌ అదుపుతప్పి యువకుడు దుర్మరణం.. ఇద్దరి పరిస్థితి విషమం

హైదరాబాద్‌ : స్కూటర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని యువకులు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆదివారం బోయిన్‌పల్లి-మెడ్చల్‌ రహదారిపై తాడ్‌బంద్‌ ముస్లిం శ్మశాన వాటిక ములమలుపు వద్ద సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రాహుల్‌ (21), దీపక్‌ (22) సోదరులు. కొంతకాలంగా రాహుల్‌ న్యూ బోయిన్‌పల్లిలో పెట్రోల్‌ బంక్‌లో.. దీపక్ అమీర్‌పేట్‌లోని ఎలక్ట్రిక్‌ షాపులో పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నారు. మెడ్చల్‌లోని మార్చుల్‌ దుకాణంలో పనిచేసే వీరి స్నేహితుడు ధర్మేంద్ర(24) ఆదివారం యజమాని స్కూటర్‌ (హోండా యాక్టివా) తీసుకొని అమీర్‌పేటకు వెళ్లి దీపక్‌ను తీసుకొని ఇద్దరు రాహుల్‌ కోసం న్యూబోయిన్‌పల్లికి వచ్చారు.

రాహుల్‌ని సైతం వెంట బెట్టుకొని ముగ్గురు సికింద్రాబాద్‌ వైపు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అతివేగం కారణంగా వాహనం ఢీవైడర్‌ పైనుంచి ఎగిరి అవతలివైపు పడింది. దీంతో ముగ్గురి తలలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ధర్మేంద్ర (24) మృతి చెందాడు. రాహుల్‌, దీపక్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo