బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 29, 2020 , 08:10:17

బేగంపేట మెట్రోస్టేషన్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

బేగంపేట మెట్రోస్టేషన్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్‌ : బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఈ నెల 26న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్నాడు. ఈ నెల 14న నగరానికి వచ్చాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో చేరాడు. మంజునాథ్ సోదరుడు గోవర్ధన్ అతనికి ఫోన్ చేయగా హాస్టల్‌లో ఉంటున్నట్లు చెప్పాడు.

గోవర్ధన్‌ ఈ నెల 23న హాస్టల్‌ యజమాని సైదిరెడ్డికి ఫోన్‌ చేయగా.. ప్రతి రోజు ఆఫీస్‌కి వెళ్లి వస్తున్నట్లు చెప్పాడు. ఈ నెల 23న తిరిగి గోవర్ధన్‌ ఫోన్‌ చేయగా.. హాస్టల్‌లో ఉన్నట్లు చెప్పాడు. తన సోదరుడు ఫోన్‌ ఎత్తడం లేదని, అతనికి ఫోన్ ఇవ్వాలని కోరాడు. ఫోన్‌ తీసుకునేందుకు మంజునాథ్‌ నిరాకరించాడు. సెల్‌కి ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. దీంతో ఈ నెల 26న యజమానికి ఫోన్‌ చేయగా.. గడిచిన నాలుగు రోజులుగా మంజునాథ్‌ హాస్టల్‌కి రావడం లేదని చెప్పాడు.

దీంతో గోవర్ధన్‌ అదే రోజు రాత్రి స్నేహితుడు సూర్యప్రకాశ్‌ను హాస్టల్‌కు పిలిపించాడు. అక్కడ మంజునాథ్ కనిపించలేదు. ఫలితం లేకపోవడంతో 27న మధ్యాహ్నం గోవర్ధన్‌ నగరానికి వచ్చాడు. సాయంత్రం పంజాగుట్ట పోలీసులు ఫోన్ చేసి మంజునాథ్ బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి కింద పడి మృతి చెందాడని చెప్పారు. మంజునాథ్ మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. మంజునాథ్‌ పై నుంచి దూకుతున్న చిత్రాలు లభ్యమయ్యాయి.

దీంతో పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులతో సరిగ్గా మాట్లాడడం లేదని తెలుస్తోంది. ఈ నెల 26 రాత్రి 10గంటల ప్రాంతంలో బేగంపేట మెట్రోస్టేషన్ పై నుంచి దూకగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఉస్మానియా దవాఖానకు తరలించగా.. మృతి చెందాడని పోలీసులు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo