సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 13, 2020 , 15:17:46

భూత వైద్యం పేరిట లైంగిక దాడి.. దొంగ‌బాబాకు దేహ‌శుద్ది

భూత వైద్యం పేరిట లైంగిక దాడి.. దొంగ‌బాబాకు దేహ‌శుద్ది

నిజామాబాద్ : భూత‌వైద్యం పేరిట ఓ దొంగ‌బాబా మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేశాడు. అమ్మాయిల‌ను లోబ‌ర్చుకున్నాడు. ఓ యువ‌తికి క‌డుపునొప్పి రావ‌డంతో బాబా అస‌లు బాగోతం బ‌య‌ట‌ప‌డింది. దీంతో అత‌నికి బాధితురాలి కుటుంబ స‌భ్యులు దేహ‌శుద్ది చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలోని జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ కాల‌నీలో వెలుగు చూసింది. 

ఆరోగ్యం బాగాలేని అమ్మాయిలు, మ‌హిళ‌ల‌కు న‌యం చేస్తాన‌ని దొంగ బాబా న‌మ్మించాడు. ఒక‌ట్రెండు రోజుల్లో రోగం న‌యం కాదు.. కొన్ని వారాలు ప‌డుతుంది అని బాబా మాయ‌మాట‌లు చెప్పేవాడు. ఈ క్ర‌మంలో మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధించేవాడు. అమ్మాయిల‌ను త‌న ఇంటికి పిలిపించుకుని మ‌త్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేవాడు. విష‌యం బ‌య‌ట‌కు చెబితే చంపేస్తాన‌ని బెదిరించేవాడు. 

అయితే నిజామాబాద్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక.. బాబా వ‌ద్ద భూత వైద్యం తీసుకుంటుంది. ఆ బాలిక‌కు మంగ‌ళ‌వారం తీవ్ర‌మైన క‌డుపు నొప్పి రావ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె లైంగిక దాడికి గురైంద‌ని వైద్యులు నిర్ధారించారు. ఈ క్ర‌మంలో త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానాన్ని బాధితురాలు త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. దీంతో దొంగ‌బాబా వ‌ద్ద‌కు వెళ్లిన బాధితురాలి కుటుంబ స‌భ్యులు.. అత‌నిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు. 


logo