శుక్రవారం 05 జూన్ 2020
Crime - Apr 06, 2020 , 14:53:37

భర్తను లారీతో ఢీకొట్టించి హత్య చేయించిన భార్య!

భర్తను లారీతో ఢీకొట్టించి హత్య చేయించిన భార్య!

అమరావతి: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో  జనజీవనం స్తంభించిపోయింది. రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్డు ప్రమాదాలు,  నేరాలు తగ్గాయి.   చిత్తూరు జిల్లా మదనపల్లెలో  వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రియుడి కోసం ఓ వివాహిత  కట్టుకున్న భర్తను లారీతో గుద్దించి హత్య చేయించింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమండ్యం మండలంలోని చెరువు ముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం (35).. 11 ఏళ్ల క్రితం నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మదనపల్లెలోని కదిరి రోడ్డులో గిఫ్ట్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే, వ్యాపారంలో నష్టం రావడంతో రెండేళ్ల క్రితం తిరుపతి వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించాడు.

పిల్లలతో కలిసి మదనపల్లెలో ఉంటున్న రేణుకకు ఈ క్రమంలో  కె.నాగిరెడ్డితో ఏర్పడిన పరిచయం సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఇటీవల తిరిగి మదనపల్లెకు వచ్చిన సుబ్రహ్మణ్యం తన భార్య నాగిరెడ్డితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి మందలించాడు. ఇదే విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

భర్తను వదిలించుకోవాలని భావించిన రేణుక ఇదే విషయాన్ని ప్రియుడు నాగిరెడ్డికి చెప్పి భర్త హత్యకు ప్లాన్ చేసింది. శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యానికి జలుబు చేయడంతో మందులు తెచ్చుకోవాలంటూ రాత్రి 11 గంటల సమయంలో ఒత్తిడి చేసింది. అతడు బయటకు వెళ్లగానే విషయాన్ని ప్రియుడికి చేరవేసింది.  సమయం కోసం వేచి చూస్తున్న నాగిరెడ్డి మందులు తీసుకుని వస్తుండగా లారీతో ఢీకొట్టి హత్య చేశాడు. సుబ్రహ్మణ్యం సోదరుడు, న్యాయవాది అయిన కె.రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేప్టటిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 


logo