బుధవారం 20 జనవరి 2021
Crime - Dec 23, 2020 , 11:16:10

బాత్రూంలో ప్రసవించిన మహిళ.. శిశువు మృతి

బాత్రూంలో ప్రసవించిన మహిళ.. శిశువు మృతి

హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యులు అందుబాటులో లేక హాస్పిటల్‌ బాత్రూంలో గర్భిణి ప్రసవించడంతో శిశువు మృతి చెందింది. ఈ ఘటన తాండూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు వేకువ జామున 3 గంటల ప్రాంతంలో మల్‌రెడ్డిపల్లికి చెందిన గర్భిణి మనీషా పురిటి నొప్పులతో ప్రసవం కోసం వచ్చింది. అయితే చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హాస్పిటల్‌ ఆవరణలో ఆ మహిళ ప్రసవించింది. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె బాత్రూం గదిలోకి వెళ్లి ప్రసవించగా.. పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసవం కోసం వచ్చిన సమయంలో వైద్యులెవరూ అందుబాటులో లేరని, డాక్టర్ల గురించి అడిగినా నిర్లక్ష్య సమాధానం చెప్పారని ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోకుంటే మరింత ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


logo