మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 29, 2020 , 10:35:07

నాలుక కోసి అత్యాచారం..చికిత్స పొందుతూ యువతి మృతి

నాలుక కోసి అత్యాచారం..చికిత్స పొందుతూ యువతి మృతి

న్యూఢిల్లీ : కామాంధులు చెలరేగిపోయారు. పంట పొలాల చాటున ఓ యువతిపై విరుచుకుపడ్డారు. అరవకుండా నాలుక కోసి అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌లో చోటు చేసుకుంది. 

హత్రస్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఈ నెల 14న తన అమ్మ, సోదరుడితో కలిసి గడ్డి కోసం పంట పొలాల్లోకి వెళ్లారు. గడ్డి కోసుకుని ముందే సోదరుడు ఇంటికి వచ్చాడు. తల్లి, కూతురు పొలంలోనే ఉండిపోయారు. తల్లికి కొద్ది దూరంలో ఉన్న ఆ యువతిని నలుగురు దుండగులు సమీపంలో ఉన్న సజ్జ చేనులోకి లాక్కెళ్లారు. ఆమె అరవకుండా నాలుక కోసేశారు. ఆ తర్వాత నలుగురు కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఎస్సీ కులానికి చెందిన యువతి కాగా, నలుగురు దుండగులు అగ్రకులాలకు చెందిన వారు.

పొలంలోనే ఉన్న తల్లి.. కూతురు కనిపించకపోయేసరికి ఆందోళన చెందింది. అక్కడున్న పంట పొలాల్లో వెతకగా కూతురు కనిపించింది. అప్పటికీ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మొత్తానికి అక్కడ్నుంచి అలీఘర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో నిన్ననే ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆమె మృత్యువుతో పోరాడి ఓడింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవలే నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారని, 14వ తేదీన ఫిర్యాదు చేస్తే నాలుగైదు రోజుల తర్వాత కేసు నమోదు చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. logo