కోల్కతా: భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా బెదిరింపు కోసం అలా చేస్తున్నాడనుకున్న భార్య తన మొబైల్లో వీడియో తీసింది. అతడు మరణించగా భర్త బంధువుల ఫిర్యాదుతో భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల నేహా శుక్లా, 25 ఏండ్ల అమోన్ షా ఐదేండ్లుగా ప్రేమించుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 11న పెండ్లి చేసుకున్నారు. పెండ్లి అనంతరం ఇద్దరు ఉద్యోగం మానేశారు. అమోన్ వ్యాపారం ప్రారంభించాడు.
అయితే పెండ్లైన నాలుగు నెలల్లోనే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన నేహా ఈ నెల 5న కోల్కతాకు తిరిగి వచ్చింది. ఆ వెంటనే భర్తను విడాకులు కోరింది. మరోవైపు భర్త తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం వెళ్లూరు వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో విడాకుల కోసం భార్య ఒత్తిడి చేయడంతో అమోన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, బెదిరింపు కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా భర్త నటిస్తున్నట్లు నేహా అనుకున్నది. సీరియస్గా తీసుకోక తన మొబైల్లో వీడియో తీసింది. ఆమె మొబైల్లోని ఈ వీడియోను గమనించిన అమోన్ కుటుంబ సభ్యులు నేహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇటీవల ఢిల్లీకి వెళ్లిందని, తాను కూడా వస్తానని భర్త అడిగితే రావద్దని చెప్పిందన్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత విడాకుల కోసం నేహా ఒత్తిడి చేసిందని, దీని వెనుక ఏదో ఉన్నదని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు భర్తను పురికొల్పిన భార్యపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.