శనివారం 16 జనవరి 2021
Crime - Dec 24, 2020 , 16:42:07

ప‌బ్లిక్ టాయిలెట్‌లో మ‌హిళా పోలీసు ఫోన్‌ నంబ‌ర్‌

ప‌బ్లిక్ టాయిలెట్‌లో మ‌హిళా పోలీసు ఫోన్‌ నంబ‌ర్‌

బెంగ‌ళూరు : త‌న‌తో ఫోన్ మాట్లాడ‌టం లేద‌నే అక్క‌సుతో ఓ వ్య‌క్తి మ‌హిళా పోలీసు ఫోన్ నంబ‌ర్‌ను ప‌బ్లిక్ టాయిలెట్‌లో రాసి ఘోరంగా అవ‌మానించాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్క‌మ‌గ‌ళూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

మ‌హిళా పోలీసు నందిని(32), స‌తీష్ సీఎం(33) 2006-07లో ఇంట‌ర్మీడియ‌ట్ క్లాస్‌మేట్స్‌. అయితే 2017లో నందిని ఫ్రెండ్స్ త‌మ కాలేజీ స్నేహితుల‌తో క‌లిపి ఓ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఈ క్ర‌మంలో త‌రుచుగా నందినికి స‌తీష్ ఫోన్ చేసి మాట్లాడేవాడు. గ‌త కొంత కాలం నుంచి స‌తీష్ ఫోన్ కాల్స్‌ను నందిని స్వీకరించ‌డం ఆపేసింది. దీంతో నందినిపై ప‌గ పెంచుకున్న స‌తీష్‌.. చిక్క‌మ‌గ‌ళూరు జిల్లాలోని క‌డూరు బ‌స్టాండ్‌లోని ప‌బ్లిక్ టాయిలెట్‌లో ఆమె ఫోన్ నంబ‌ర్ రాశాడు. ఇక అప్ప‌ట్నుంచి ఆమెకు ఫోన్ కాల్స్ ఎక్కువ‌య్యాయి. అస‌భ్య‌క‌రమైన ప‌ద‌జాలం ఉప‌యోగించి ఆమెను మాన‌సికంగా వేధిస్తున్నారు. అయితే త‌న ఫోన్ నంబ‌ర్ క‌డూరు బ‌స్టాండ్‌లోని ప‌బ్లిక్ టాయిలెట్‌లో రాసిన‌ట్లు ఆమె తెలుసుకుంది. 

నిందితుడిని ప‌ట్టించిన హ్యాండ్ రైటింగ్‌

ఇక నందిని త‌న భ‌ర్త‌ను తీసుకుని డిసెంబ‌ర్ 15వ తేదీన క‌డూరు బ‌స్టాండ్‌కు చేరుకుంది. అక్క‌డి ప‌బ్లిక్ టాయిలెట్లో త‌న ఫోన్ నంబ‌ర్‌ను చూసింది. అయితే ఆ నంబ‌ర్ రాసింది త‌న ఫ్రెండ్ స‌తీష్ అని తేల్చింది. ఎందుకంటే అది అత‌ని హ్యాండ్ రైటింగే అని నందిని స్ప‌ష్టం చేసింది.  దీంతో అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌తీష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. త‌న ఫోన్ కాల్స్‌ను స్వీక‌రించ‌నందుకే ప‌బ్లిక్ టాయిలెట్‌లో ఫోన్ నంబ‌ర్ రాయాల్సి వ‌చ్చింద‌ని స‌తీష్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.