శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 16:26:36

ఫిర్యాదును స్వీకరించడం లేదని పోలీస్‌స్టేషన్‌లో శానిటైజర్‌ తాగిన మహిళ

ఫిర్యాదును స్వీకరించడం లేదని పోలీస్‌స్టేషన్‌లో శానిటైజర్‌ తాగిన మహిళ

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి మండలం తార్లి బొద్దపాడు గ్రామానికి చెందిన ఎర్రమ్మ (50)గత 3 నెలలుగా పొరుగు మహిళతో గొడవలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వారు ఫిర్యాదును స్వీకరించడం లేదని ఆరోపిస్తూ పోలీసుల ఎదుటే శానిటైజర్‌ తాగేసింది. వెంటనే పోలీసులు ఆమెను స్థానిక దవాఖానకు తరలించగా మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 

ఎర్రమ్మ కుమారుడు చిరంజీవి మాట్లాడుతూ తాము ఇంటికి పునర్నిర్మాణ పనులు చేపడుతుండగా కొంత ఇసుక ఎదురింటి వారిపై పడడంతో వారు గొడవకు దిగారు. ఇదే విషయమై వాగ్వాదం తీవ్రం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తన తల్లి స్టేషన్‌కు వెళ్లగా వారు ఫిర్యాదును స్వీకరించకపోవడమే కాకుండా తన తల్లిని వేధించారని దీంతో ఎర్రమ్మ శానిటైజర్‌ తాగిందని ఆమె కుమారుడు తెలిపాడు. 

అయితే ఈ విషయమై కోటబొమ్మాలి ఎస్‌ఐ లక్ష్మణారావు మాట్లాడుతూ..  ‘‘ఎర్రమ్మ ఇంటి ఎదురుగా ఒక దళిత మహిళ నివాసం ఉంటుంది. గ్రామ వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎర్రమ్మ కుమారుడు చిరంజీవి, దళిత మహిళ కుమార్తెను మూడు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై ఆ మహిళ తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసింది. అప్పుడు తాము చిరంజీవిని పిలిచి హెచ్చరించి పంపామని’’ ఎస్‌ఐ తెలిపారు. 

తరువాత ఇటీవల వాగ్వాదం తీవ్రం కావడంతో ఎర్రమ్మ కూడా దళిత మహిళపై ఫిర్యాదు చేయడానికి పలుమార్లు స్టేషన్‌కు వచ్చిందని ఎస్‌ఐ తెలిపారు. గురువారం ఎర్రమ్మ మరోసారి వచ్చి తమ సిబ్బందితో గొడవకు దిగిందని, తాము మాట్లాడుతుండగానే శానిటైజర్‌ తాగేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగమని ఆయన తెలిపారు. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా, ఆమె తన ఫిర్యాదును తీసుకోలేదని మాపై ఆరోపణలు చేస్తోందని ఎస్‌ఐ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo