అమరావతి: ప్రేమించిన ప్రియురాలిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉండే ఓ రెడీమేడ్ బట్టల దుకాణం నిర్వాహకుడు షార్పీదున్ను ప్రేమించింది. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది. కాగా, ఆ యువతి తనను పెళ్లి చేసుకోమని కోరగా ఏదోకటి చెప్పి తప్పించుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే గుత్తికి చెందిన యువతితో ఈ నెల 9న షార్పీదున్కు వివాహం చేయాలని కుటుంబ పెద్దలు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న బాధితురాలు మోసపోయానని తెలుసుకుని ఈ నెల 8న ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వెంటనే వధువు తరఫు పెద్దలకు సమాచారం అందించారు. దీంతో గుత్తిలోని కళ్యాణ మండపంలో పెళ్లి ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రేమించిన యువతిని మోసం చేసిన షార్పీదున్పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.