మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 20, 2020 , 07:09:37

భార్యాపిల్లలను దారుణంగా చంపేశాడు..

భార్యాపిల్లలను దారుణంగా చంపేశాడు..

న్యూఢిల్లీ : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. తన భార్యాపిల్లలను అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఔటర్‌ ఢిల్లీలోని నీహాల్‌ విహార్‌లో చోటు చేసుకుంది. గగన్‌, ప్రీతి(29) దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల బాలుడు, ఐదేళ్ల కూతురు ఉన్నారు. అయితే గగన్‌ నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను హింసించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రీతిపై సుత్తితో దాడి చేసి చంపేశాడు. ఆమె శరీరంపై చాలా చోట్ల గాయాలు ఉన్నాయి. కుమారుడి చేతులు, కాళ్లు కట్టేసి హత్య చేశాడు. కూతురు కూడా రక్తపు మడుగులో పడి ఉంది. ఈ ముగ్గురిని చంపేసిన అనంతరం గగన్‌ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మూడు హత్యల ప్రధాన నిందితుడు గగనే అని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. గగన్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


logo