శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Sep 22, 2020 , 02:00:08

కొడుకుకు ఉద్యోగం, కూతురు ప్రేమపెళ్లి కోసం భర్తను...

కొడుకుకు ఉద్యోగం, కూతురు ప్రేమపెళ్లి కోసం భర్తను...

బెల్లంపల్లి రూరల్‌: కొడుకుకు ఉద్యోగం వస్తుందని, కూతురి ప్రేమ వివాహం జరిపించవచ్చనే దురాలోచనతో కట్టుకున్న భర్తను పొట్టన పెట్టుకున్నది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా పాత బెల్లంపల్లిలో ఈ నెల 4న జరగ్గా పోలీసుల విచారణలో వీరి బండారం బయటపడింది. సోమవారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాత బెల్లంపల్లికి చెందిన శంకర్‌ (56), విజయ దంపతులు. వీరికి కొడుకు శ్రావణ్‌, కూతురు స్వాతి ఉన్నారు. శంకరి సింగరేణి కార్మికుడు. ఇతను మంచిర్యాలలోని మరో మహిళతో కలిసి ఉంటుండటంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. చిన్న కూతురు స్వాతి, శివసాయిని ప్రేమించింది. వీరి పెండ్లికి శంకర్‌ అంగీకరించలేదు. శంకర్‌ను చంపేస్తే కూతురు స్వాతి ప్రేమ వివాహం చేసుకోవచ్చని, కొడుకు శ్రావణ్‌కు డిపెండెంట్‌ ఉద్యోగం లభిస్తుందని భార్య విజయ పథకం రచించింది. ఈనెల 4న శంకర్‌ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో స్వాతి ప్రియుడు శివసాయి బ్లౌజులు ధరించి తన బెల్ట్‌ను మెడకు చుట్టగా విజయ గట్టిగా బిగించిందని, శ్రావణ్‌, స్వాతి.. కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకోవడంతో శంకర్‌ ప్రాణాలు వదిలినట్లు పోలీసులు తెలిపారు. అనుమానం రాకుండా ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని వారు పేర్కొన్నారు. భార్య విజయ, కొడుకు శ్రావణ్‌, కూతురు స్వాతిలను పోలీసులు విచారించగా హత్య వివరాలు వెలుగు చూశాయి. శివసాయి పరారీలో ఉన్నట్లు ఏసీపీ రహెమాన్‌ తెలిపారు.


logo