శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 23, 2020 , 08:18:51

బీమా డబ్బుల కోసం భర్తను కడతేర్చిన భార్య

బీమా డబ్బుల కోసం భర్తను కడతేర్చిన భార్య

వరంగల్‌: బీమా డబ్బుల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. పక్కా ప్లాన్‌తో హత్య చేసి తనకేమీ తెలియనట్లు తన భర్త జాడ చెప్పాలని ఠాణా మెట్లెక్కిన ఓ కిరాతక మహిళ గుట్టును బయటపెట్టారు పర్వతగిరి పోలీసులు. ప్రధాన నిందితురాలతో పాటు సహకరించిన మృతుడి చెల్లెలు, బావను అరెస్టు చేసి సోమవారం ఈస్ట్‌జోన్‌ ఇన్‌చార్జి డీసీపీ కొల్లి వెంకటలక్ష్మి వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 

వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం హట్యతండాకు చెందిన బాదావత్‌ వీరన్న, యాకమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వారు బతుకుదెరువు కోసం పున్నెల్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో దోబీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరన్న తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం భార్యను వేధిస్తున్నాడు. దీంతో అసహనానికి గురైన యాకమ్మ ఎలాగైనా తన భర్తను చంపాలని నిర్ణయించకుంది. భర్తను చంపిన తర్వాత వచ్చే బీమా సొమ్ముతో జీవనం కొనసాగించవచ్చనే దురాలోచనతో మృతుడి పేరుపై స్థానిక గ్రామీణ బ్యాంకులో రూ. 20 లక్షలకు జీవిత బీమా చేయించింది. 

లాక్‌డౌన్‌ కారణంగా గ్రామంలోనే ఉంటున్న వీరన్న మద్యం ఖాళీ సీసాలు సేకరించి నెక్కొండలో అమ్ముతున్నాడు. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఖాళీ మద్యం సీసాలను అమ్మేందుకు వీరన్న నెక్కొండకు వెళ్లాడు. దీంతో యాకమ్మ తన ఆడపడుచు భూక్య బుజ్జి, ఆమె భర్త బిచ్యకు సమాచారం చేరవేసింది. దీంతో బిచ్య నెక్కొండకు వెళ్లి వీరన్నను కలిసి మద్యం తాగించాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై హట్యతండాకు తీసుకొచ్చాడు. ఇదే అదునుగా భావించిన వారు మద్యం మత్తులో ఉన్న వీరన్నను రాత్రి 11.00 గంటలకు నెక్కొండ రోడ్డులోని పొలంలో (వీరన్నకు చెందినది) ఉరివేసి హత్య చేశారు. బతికే ఉన్నాడనే అనుమానంతో బండరాయితో మోది పక్కనే ఉన్న కెనాల్‌లో పడేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అనంతరం తన భర్త కనిపించడం లేదని యాకమ్మ తన అక్కతో కలిసి పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

సీపీ రవీందర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పర్వతగిరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పుల్యాల కిషన్‌ సిబ్బందితో కలిసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ మేరకు సోమవారం మృతుడి ఇంటి వద్దే ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. నిందితుల నుంచి ద్విచక్ర వాహనంతోపాటు నైలాన్‌తాడు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, జీవిత బీమా పత్రం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  


logo