గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 18:12:58

భార్యను కత్తితో పొడిచి ఉరేసుకొని భర్త ఆత్మహత్య.. తాంత్రికుడి వద్దకు రానన్నందుకే.!

భార్యను కత్తితో పొడిచి ఉరేసుకొని భర్త ఆత్మహత్య.. తాంత్రికుడి వద్దకు రానన్నందుకే.!

బంకురా : పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. తాంత్రికుడి వద్దకు రానన్న భార్యను భర్త కత్తితో పొడిచి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బంకురా జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. మనచార్ రామకృష్ణపల్లికి చెందిన  సుర్జో సర్కార్ (36) భార్య అపర్ణ (30)తోపాటు ముగ్గురు కుమార్తెలతో స్థానికంగా నివాసం ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగం కోల్పోయి తరచూ భార్యతో గొడవ పడేవాడు. తన బాధలను అధిగమించాలన్న ఆశతో సుర్జో ఓ తాంత్రికుడిని కలవడం ప్రారంభించాడు.

మంగళవారం భార్యను తాంత్రికుడిని కలిసేందుకు రమ్మనడంతో ఆమె నిరాకరించింది. కుమార్తెలను తీసుకొని తన పుట్టింటికి వెళ్లింది. తానూ కూడా అక్కడికి వెళ్లిన సుర్జో ఉదయం భార్యా పిల్లలను వెంటబెట్టుకొని ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడి క్షణికావేశంలో కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితిలో చేరగా చనిపోయిందని భావించి.. తానూ గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని బార్జోరా పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు. అపర్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, సుర్జో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo