మంగళవారం 24 నవంబర్ 2020
Crime - Oct 27, 2020 , 16:30:08

ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం.. న‌డిరోడ్డుపై యువ‌తి కాల్చివేత ..వీడియో

ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం.. న‌డిరోడ్డుపై యువ‌తి కాల్చివేత ..వీడియో

న్యూఢిల్లీ: హ‌ర్యానా రాష్ట్రం ఫ‌రీదాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. తౌసీఫ్ అనే యువ‌కుడు నిఖిత తోమ‌ర్ అనే యువ‌తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించ‌గా ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో తుపాకీతో కాల్చి చంపాడు. వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ ప‌ట్ట‌ణం సోమ‌వారం మ‌ధ్యాహ్నం మూడున్న‌ర గంట‌ల‌కు న‌డిరోడ్డు మీద అంద‌రూ చూస్తుండ‌గానే ఈ ఘోరం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ ప‌ట్ట‌ణానికి చెందిన తౌసీఫ్‌, నిఖిత ఇద్ద‌రు స్నేహితులు. అయితే తౌసీఫ్‌ గ‌త కొంత కాలంగా నిఖిత‌ను వేధిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే కామ‌ర్స్ డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చవుతున్న నిఖిత (21) సోమ‌వారం మ‌ధ్యాహ్నం ప‌రీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్తుండ‌గా ఆమెను వెంబ‌డించాడు.   

ఆమె ప‌రీక్ష రాసి వ‌చ్చేవ‌ర‌కు కాలీజీ గేటు ముందు త‌న స్నేహితుడు రెహాన్‌తో క‌లిసి మాటువేశాడు. నిఖిత‌ ఆమె స్నేహితురాలితో క‌లిసి కాలేజీ నుంచి బ‌య‌టికి రాగానే.. తౌసీఫ్ ఆమెను బ‌లవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. ఆమె తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌డంతో తుపాకీతో త‌ల‌పై కాల్చి స్నేహితుడితో క‌లిసి పారిపోయారు. ఈ దారుణ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించగా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. నిఖిత తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్ద‌రినీ అద‌పులోకి తీసుకున్నారు. 

కాగా, ఈ దారుణంపై హ‌ర్యానాలో నిర‌సన‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకుంది. హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌, హోంమంత్రి అనిల్ విజ్ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. కేసు స‌త్వ‌ర ద‌ర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. నిందితులు ఎంత‌టి వారైనా చ‌ట్ట ప్ర‌కారం క‌ఠినంగా శిక్షిస్తామ‌ని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

కాగా, నిందితుడు గ‌తంలో కూడా త‌న కూతురును కిడ్నాప్ చేశాడ‌ని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆడ‌పిల్ల ప‌రువు పోతుంద‌న్న కార‌ణంతో కేసు ఉప‌సంహ‌రించుకున్నాన‌ని, ఇప్పుడు వాడు త‌న కూతును ప్రాణాల‌నే తీశాడ‌ని మృతురాలి తండ్రి విల‌పించాడు.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.