లక్నో : వాట్సాప్ ద్వారా దాదాపు 370 మంది మహిళలకు వీడియో కాల్స్ చేసి అభ్యంతరకరంగా వ్యవహరించిన యూపీలోని బలియాకు చెందిన 35 ఏండ్ల వ్యక్తిని మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహిళలకు చేసిన వీడియో కాల్స్‌ను రికార్డు చేసి ఎవరైనా తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబితే వారిని బ్లాక్‌మెయిల్‌కు గురిచేసేవాడు. నిందితుడిని బలియా జిల్లా గర్హవార్ పోలస్ స్టేషన్ పరిధిలో స్టేషనరీ షాపు నిర్వహించే శివ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వాట్సాప్ మెసెంజర్ ద్వారా నిందితుడు 15 జిల్లాలకు చెందిన దాదాపు 370 మంది మహిళలను వేధించాడు. ఈ నేరాన్ని చేసేందుకు శివకుమార్ వేర్వేరు సిమ్ కార్డులతో ఏడు సెల్ ఫోన్లను వాడేవాడని దర్యాప్తులో వెల్లడైంది.
గత ఏడాది ఫిబ్రవరిలో లక్నో నుంచి నిందితుడిపై తొలి ఫిర్యాదు రాగా అధికారులు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా మహిళలను వేధిస్తూనే ఉన్నాడు. నిందితుడు స్టేషనరీ షాపులో పని ముగించుకున్న తర్వాత కొన్ని నెంబర్లను సేకరించి ట్రూకాలర్ ద్వారా వారు మహిళలని నిర్ధారించుకున్న తర్వాత వారికి వాట్సాప్ వీడియో కాల్స్ చేసేవాడు. వీడియో కాల్లో నగ్నంగా మారి ముచ్చటించేవాడు. మహిళ కాల్‌ను కట్ చేసే లోపే వీడియో స్క్రీన్ రికార్డర్ ద్వారా సంభాషణ రికార్డు చేసేవాడు. ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబితే రికార్డయిన వీడియో క్లిప్‌ను ఆమె భర్తకు, అత్తమామలకు పంపుతానని బెదిరించేవాడు. దీంతో పలువురు మహిళలు తమ ఫోన్ నెంబర్లను మార్చుకునేవారు. నిందితుడు శివకుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసలు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.