శుక్రవారం 15 జనవరి 2021
Crime - Oct 15, 2020 , 20:49:33

రేషన్‌ షాపుల కేటాయింపులో ఘర్షణ.. కాల్పుల్లో ఒకరు మృతి

రేషన్‌ షాపుల కేటాయింపులో ఘర్షణ.. కాల్పుల్లో ఒకరు మృతి

లక్నో: రేషన్‌ షాపుల కేటాయింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బల్లియాలోని రియోటి ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. మృతుడ్ని 46 ఏండ్ల జైప్రకాష్‌ అలియాస్‌ గామాగా గుర్తించారు. రేషన్‌ షాపుల కేటాయింపు కోసం పంచాయతీ భవన్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృంద సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. అనంతరం ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో వారు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇంతలో ధీరేంద్ర ప్రజాపతి తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరుపగా బులెట్లు తగిలి జైప్రకాష్‌ అనే వ్యక్తి చనిపోయాడు. ఈ ఘర్షణ నేపథ్యంలో రేషన్‌ షాపుల కేటాయింపును రద్దు చేశారు. 

మరోవైపు మృతుడి సోదరుడి ఫిర్యాదుతో 20 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో భద్రత కోసం పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. రేషన్‌ షాపుల కేటాయింపు సమావేశం సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి