మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 26, 2020 , 17:44:01

ప్ర‌తీకార దాడుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు దారుణ హ‌త్య‌

ప్ర‌తీకార దాడుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు దారుణ హ‌త్య‌

చెన్నై : త‌మిళ‌నాడులోని తిరునెల్వేలి జిల్లా నంగునేరి పోలీస్ స్టేషన్ పరిధి మారుగల్‌కురిచిలో శ‌నివారం ఇద్ద‌రు మ‌హిళ‌లు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఎ. షణ్ముగతై (50), ఎస్. శాంతి (45) అనే ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. పెట్రోల్ బాంబులు విసిరి అనంత‌రం పదునైన ఆయుధాలతో దాడి చేసి హ‌త్య చేశారు. గ‌డిచిన మార్చిలో గ్రామంలో జ‌రిగిన జంట హ‌త్య‌లకు ప్ర‌తీకారంగా ఈ హ‌త్య‌లు చోటుచేసుకొని ఉండొచ్చ‌ని జిల్లా ఎస్పీ ఎన్‌. మ‌ణివ‌న‌న్ తెలిపారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఒకే గ్రామానికి చెందిన రెండు ప్రత్యర్థి వ‌ర్గాల‌ మధ్య జరిగిన ఐదవ హత్యగా ఎస్పీ పేర్కొన్నారు. గ్రామానికి చెందిన నంబిరాజన్ గ‌తేడాది టి. వాన్మతి (18) అనే స్థానిక బాలికతో పారిపోయాడు.

కాగా 2019 నవంబర్‌లో నంబిరాజన్‌ను వాన్మ‌తి సోద‌రుడు, అత‌ని స‌హ‌చ‌రులు దారుణంగా చంపి శిరచ్ఛేదనం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో వాన్మ‌తి సోద‌రుడు చెల్లాసామి, అతని సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రతీకారంగా గ్రామంలో చిన్న తినుబండారం దుకాణం నడుపుతున్న వాన్మ‌తి బంధువులు అరుముగం, సురేష్‌లు మార్చిలో హ‌త్య‌చేయ‌బ‌డ్డారు. ఈ జంట హ‌త్య‌ల‌కు సంబంధించి నంబిరాజ‌న్ త‌ల్లిదండ్రులు అరుణాచ‌లం, ష‌ణ్ముగ‌త్తై, వీరి బంధువుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంత‌కుక్రిత‌మే ష‌ణ్ముగ‌త్తై బెయిల్‌పై బ‌య‌ట‌కు రాగా మిగ‌తా నిందితులు మూడు రోజుల‌క్రిత‌మే జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. నిందితులను వెతుక్కుంటూ వచ్చిన ముఠా షణ్ముగతై ఇంటికి వెళ్లి ఆమెను హత్య చేసి శిరచ్ఛేదం చేశారు. అక్క‌డినుంచి మ‌రో నిందితుడు మురుగ‌న్ ఇంటికి వెళ్లారు. అత‌ను ఇంటిలో లేక‌పోయిన‌ప్ప‌టికీ భార్య శాంతిపై క‌త్తుల‌తో తీవ్రంగా దాడిచేశారు. ఆమె సంఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతిచెందింది. వీరి కుమార్తె సెల్వి (14)పై సైతం క‌త్తుల‌తో దాడి చేయ‌గా స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింద‌ని పోలీసులు తెలిపారు. 


logo