మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 17:49:19

మ్యాన్‌హోల్‌లో ఊపిరాడ‌క ఇద్ద‌రు పారిశుధ్య కార్మికులు మృతి

మ్యాన్‌హోల్‌లో ఊపిరాడ‌క ఇద్ద‌రు పారిశుధ్య కార్మికులు మృతి

న్యూ ఢిల్లీ :  మ్యాన్‌హోల్ శుభ్ర‌ప‌రుస్తుండ‌గా ఊప‌రాడ‌క ఇద్ద‌రు పారిశుధ్య కార్మికులు మృతిచెందిన ఘ‌ట‌న సూర‌త్‌లో సోమ‌వారం చోటుచేసుకుంది. ఇటీవ‌ల తుఫాను కార‌ణంగా పూడిక‌తో నిండిన మ్యాన్‌హోళ్ల‌ను శుభ్ర‌ప‌ర్చే ప‌నుల‌ను సూర‌త్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చేప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో నాన్‌పురా ప్రాంతంలోని మాచివాడ్ సర్కిల్ వద్ద ఎలాంటి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు పాటించ‌కుండా మోన్సింగ్ అమాలియా (52), జయేంద్ర అమాలియా (25) అనే కార్మికులు నీటి ప్రవాహాన్ని సమీపంలోని మురుగునీటి మార్గంలోకి మళ్లించడానికి మ్యాన్‌హోల్‌లోకి దిగారు. పూర్తిగా ఎండిపోయి ఉన్న మ్యాన్‌హోల్‌లో విష‌వాయువులు వ్యాపించ‌డంతో ఇద్ద‌రూ అప‌స్మార‌క స్థితికి చేరుకున్నారు. 

ఇత‌ర సిబ్బంది గుర్తించి కాంట్రాక్ట‌ర్‌కు స‌మాచారం అందించ‌గా మధ్యాహ్నం 1 గంటకు స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించి తాడు సాయంతో ఇద్ద‌రినీ బ‌య‌ట‌కు తీసి ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందార‌ని వైద్యులు ధృవీక‌రించారు. ఈ ఘ‌ట‌న‌లో కాంట్రాక్ట‌ర్‌పై కేసు న‌మోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సూరత్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ బీఎన్ పానీ మాట్లాడుతూ “ఇద్దరు కార్మికులు నేరుగా మ్యాన్‌హోల్‌లోకి ఎలా ప్రవేశించారో తెలియ‌డం లేదు. విచారణను ఆదేశాలు జారీ చేశాం. వారం తరువాత తదుపరి చర్యలు తీసుకుంటాం. మురుగునీటిని శుభ్రం చేయడానికి మాకు యంత్రాలున్నాయి. వాటిని ఎందుకు ఉప‌యోగించ‌లేదో తెలియ‌డం లేద‌”ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo