సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 15, 2020 , 18:04:37

ఇసుక అక్ర‌మ బుకింగులు.. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ అరెస్టు

ఇసుక అక్ర‌మ బుకింగులు.. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ అరెస్టు

హైద‌రాబాద్ : నిజ‌మైన అవ‌స‌రార్థుల‌కు ఇసుక దొర‌క‌కుండా అక్ర‌మ బుకింగ్‌ల‌కు పాల్ప‌డుతూ డ‌బ్బులు దండుకుంటున్న అన్న‌ద‌మ్ముల‌ను ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. సిసోడియా ఆదేశ్ జైన్‌(21), సిసోడియా అరిహంత్ జైన్‌(25) ఇరువురు అన్న‌ద‌మ్ములు. ఏళ్లుగా వీరి తండ్రి ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. వీరు కూడా ఇదే వ్యాపారాన్ని కొన‌సాగిస్తున్నారు. రాష్ర్టంలో ఇసుకను కేవ‌లం ఆన్‌లైన్ ద్వారా మాత్ర‌మే బుక్ చేసుకునేందుకు అవ‌కాశం ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. ప్ర‌తీరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 12.15 గంట‌ల మ‌ధ్య మాత్ర‌మే ఇసుక కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. ఈ పావుగంట స‌మ‌యంలో బుక్ చేయ‌గ‌లిగిన వారికి మాత్ర‌మే రిచ్‌ల నుంచి ఇసుక స‌ర‌ఫ‌రాకు వీలుంటుంది.

ఇంట‌ర్‌నెట్ మీద ప‌ట్టున్న సొసోడియా ఆదేశ్ జైన్ ఇసుక బుకింగ్‌ల‌ను త్వ‌ర‌త్వ‌రగా చేసేవాడు. అవ‌స‌రార్థుల‌కు క‌మీష‌న్‌పై ఆన్‌లైన్ బుకింగ్ ను అమ్ముకునేవాడు. ఆన్‌లైన్ బుకింగ్‌పై ఇంట‌ర్‌నెట్‌, యూట్యూబ్‌లో శోధించడంతో పాటు డొమైన్ త‌యారు చేసే వ్య‌క్తితో బిజినెస్ ఒప్పందం కుదుర్చుకుని ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ప్ర‌భుత్వ సైట్‌లోకి చొప్పించాడు. ఇసుక ఆన్‌లౌన్ బుకింగ్ ఓపెన్ కాగానే ముందుగానే నిర్ణ‌యించిన వివ‌రాల‌తో కూడిన లిస్ట్ ఇసుక కొర‌కు బుకింగ్ అయ్యేది. ఇలా బుక్ అయిన ఇసుక‌ను డిమాండ్‌ను బ‌ట్టీ క‌మీష‌న్ తీసుకుంటూ అమ్మేవాడు.

దీంతో నిజ‌మైన ల‌బ్దిదారులకు నిరాశే ఎదురైతుంది. రోజుల త‌ర‌బ‌డి వేచి ఉన్నా ఇసుక బుకింగ్ జ‌రిగేది కాదు. ఇలా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితులైన అన్న‌ద‌మ్ముల‌ను గుర్తించి అరెస్టు చేశారు. వీరి వ‌ద్ద నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు, మూడు మొబైల్ ఫోన్లు, ప‌లు రిసిప్ట్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రూ. 50 ల‌క్ష‌ల‌కు పైగా ఇలా అక్ర‌మ బుకింగ్‌ల‌తో సంపాదించిన‌ట్లుగా స‌మాచారం. 


logo