గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 21:41:59

నెల‌కు రూ.40 వేల జీతంతో దొంగ‌త‌నం ఉద్యోగం

నెల‌కు రూ.40 వేల జీతంతో దొంగ‌త‌నం ఉద్యోగం

సిద్దిపేట : నెల‌కు రూ. 40 వేల జీతంతో దొంగ‌త‌నం ఉద్యోగం. ఇదేంటి అనుకుంటున్నారా? అవును మ‌రి.. స్మార్ట్ ఫోన్లు, ప‌ర్సుల‌ను కొట్టేసేందుకు ఇద్ద‌రు మైన‌ర్ల‌ను మ‌రో ఇద్ద‌రు దొంగ‌లు నెల‌కు రూ. 40 వేల జీతం ఇచ్చి ప‌నిలో పెట్టుకున్నారు. నిందితుల్లో ఒకరిని సిద్దిపేట పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... కుటుంబ స‌భ్యుల స‌మ్మ‌తితోనే మైన‌ర్లు(12 ఏళ్లు, 13 ఏళ్లు) ఈ పని చేస్తున్నారు. గ‌త రెండున్న‌రేళ్లుగా వీరు ప‌ర్సులు, ఫోన్ల‌ను దొంగిలిస్తున్నారు. ఒప్పందం ప్ర‌కారం మిగ‌తా ఇద్ద‌రు దొంగ‌లు మైన‌ర్ల కుటుంబాల‌కు చెప్పిన విధంగా ఏపీలోని అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో ఉండే ఒక్కో కుటుంబానికి నెల‌కు రూ. 40 వేలు పంపిస్తున్నారు.

ఆగ‌స్టు 22న సిద్దిపేట‌లోని రైతు బ‌జార్‌లో ఓ సెల్‌ఫోన్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేర‌కు సిద్దిపేట వ‌న్ టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ప‌రిశీలించ‌గా చోరీ జ‌రిగిన తీరు వెలుగులోకి వ‌చ్చింది. రైతు బ‌జార్‌లోకి ప్ర‌వేశించిన ఈ దొంగ‌ల గ్యాంగ్‌లోని మైన‌ర్లు ఓ వ్య‌క్తి వ‌ద్ద నుంచి సెల్‌ఫోన్‌ను మ‌రో వ్య‌క్తి వ‌ద్ద నుంచి ప‌ర్సును కొట్టేశారు. వీటిని గుజ్జాల వెంక‌ట్ అనే వ్య‌క్తికి అప్ప‌గించారు. ఇత‌డు రంగారెడ్డి జిల్లా చెంగిచెర్ల నివాసి. మ‌రో వ్య‌క్తి ఏపీలోని అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వరానికి చెందిన గుంజా గంజ‌య్య‌(40). మ‌హేంద్ర బొలేరో వాహ‌నంలో పార్కింగ్ స్థ‌లంలో నిరీక్షించేవాడు. పోలీసులు ఈ న‌లుగురిని ప‌రిశీలించ‌డం మొద‌లుపెట్టారు. సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా వ‌న్‌టౌన్ పోలీసులు సిద్దిపేట పాత బ‌స్టాండ్‌లో స‌ద‌రు వాహ‌నాన్ని గుర్తించారు. వెంట‌నే రైడ్ చేయ‌గా గంజ‌య్య ప‌ట్టుబ‌ట్టాడు. మిగ‌త‌వారు త‌ప్పించుకు పారిపోయారు. మిగ‌తావారి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.


logo