ఎల్బీనగర్, మే 25: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బాక్స్ డ్రెయిన్ పనులను వేగంగా చేపట్టి వర్షాకాలంలో వరదనీరు నిల్వకుండా చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఇంజినీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని డివిజన్లలో చేపట్టబోయే బాక్స్ డ్రెయిన్ల మ్యాప్‌లను పరిశీలించడం జరిగిందని వారం రోజుల్లోనే పనులను ప్రారంభించి వేగంగా పూర్తిచేసి వరదనీరు నిల్వకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా సాగర్ ఎన్‌క్లెవ్ నుంచి కేకే గార్డెన్స్ వరకు 460 మీటర్లు, లైన్ నాజ్ స్కూల్ నుంచి కస్తూరికాలనీ వరకు 416 మీటర్లు, లైన్నాజ్ స్కూల్ నుంచి శ్రీరమణకాలనీ వరకు 416 మీటర్లు బాక్స్ డ్రైయిన్ లైన్, వంగ శంకరమ్మ గార్డెన్స్ నుంచి శ్రీనగర్‌కాలనీ వరకు 338 మీటర్లు, శ్రీనగర్‌కాలనీ నుంచి గాయత్రినగర్ వరకు 657 మీటర్లు, చంద్రగార్డెన్స్ నుంచి శివసాయికాలనీ వరకు 340 మీటర్ల డ్రైయిన్లను వెంటనే ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమస్యలను తొలగించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. ఈఈ రమేశ్‌బాబు, ఏఈ హేమూనాయక్ తదితరులు పాల్గొన్నారు.