శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 31, 2020 , 16:38:40

ఇద్ద‌రు సీపీఐ (ఎం) కార్య‌క‌ర్తల దారుణ‌హ‌త్య!‌

ఇద్ద‌రు సీపీఐ (ఎం) కార్య‌క‌ర్తల దారుణ‌హ‌త్య!‌

తిరువ‌నంత‌పురం: చాలా రోజులుగా ప్ర‌శాంతంగా  ఉన్న‌ కేర‌ళ‌లో మ‌రోసారి రాజ‌కీయ హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఆదివారం కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో అధికార సీపీఐ (ఎం) పార్టీకి చెందిన ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు దారుణహ‌త్య‌కు గుర‌య్యారు. ప్ర‌త్య‌ర్థులు వారిని విచ‌క్ష‌ణార‌హితంగా న‌రికి చంపారు. తిరువ‌నంత‌పురం రూర‌ల్ ఏరియాలోని వెంజ‌ర‌మూడు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ హ‌త్య‌లు కేర‌ళ‌లోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య రాజ‌కీయ దుమారానికి తెర‌తీశాయి.

వెంజ‌ర‌మూడు గ్రామానికి చెందిన మిథిల్‌రాజ్ (32), హ‌క్ ముహ‌మ్మ‌ద్ (24) ఇద్ద‌రూ సీపీఐ (ఎం) పార్టీ కార్య‌క‌ర్త‌లు. ఆదివారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు ప్ర‌త్య‌ర్థులు వారిని క‌త్తుల‌తో దారుణంగా న‌రికి చంపారు. మిథిల్‌రాజ్ ఘ‌ట‌నా ప్రాంతంలోనే ప్రాణాలు కోల్పోగా, హ‌క్ ముహ‌మ్మ‌ద్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ హ‌త్య‌ల‌తో అధికార సీపీఐ (ఎం), ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న‌ది. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద త‌ల‌ల ద‌న్నుతోనే ఈ హ‌త్య‌లు జ‌రిగాయ‌ని అధికార సీపీఐ (ఎం) పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కొడియేరి బాల‌కృష్ణ‌న్ ఆరోపించ‌గా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ర‌మేశ్ చెన్నితాల ఆ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చారు. హ‌త్యా రాజ‌కీయాలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని మిగ‌తా వారి కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo