శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 13:20:01

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు

హైదరాబాద్‌ : టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ పోలీసుల ఎదుట ఆరోపణలు దేవరాజు విచారణకు హాజరయ్యాడు. పోలీసుల ఆదేశాల మేరకు దేవరాజు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు విచారణ కోసం వచ్చాడు. తనవద్దనున్న కాల్‌ రికార్డులను పోలీసులకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు దేవరాజు వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. శ్రావణిని దేవరాజు వేధించాడని, చివరకు వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులే తను వేధిస్తున్నారని శ్రావణి తనకు చెప్పిందని దేవరాజు పేర్కొంటున్నాడు. కేసులో శ్రావణి కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా, బంధువులు, అభిమానుల కన్నీటి మధ్య శ్రావణి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో అంత్యక్రియలు జరిగాయి. స్థానిక హిందూ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయ ప్రకారం.. తన తండ్రి చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. బంధువులు, అభిమానులు శ్రావణికి కన్నీటి వీడ్కోలు పలికారు.

సంచలనం రేపుతున్న మరో ఆడియో..

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఓ సినీ నిర్మాత - శ్రావణి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దేవరాజు మీద శ్రావణి గతంలో కేసు నమోదు చేసిన సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతకు, శ్రావణికి మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి రావడంతో ఆసక్తికరంగా మారింది. దేవరాజు, శ్రావణి, నిర్మాతకు మధ్య ఉన్న సంబంధం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. కాగా శ్రావణిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజుకు సంబంధించిన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టిక్‌టాక్‌లో అమ్మాయిలను ఫ్రెండ్స్‌ చేసుకునేవాడని, వారితో స్నేహం పెంచుకుని, డబ్బు వసూలు చేసేవాడని అతడిపై శ్రావణి గతంలో ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రేమించి, మొహం చాటేయడంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు దేవరాజుపై ఆరోపణలు చేస్తున్నారు.

ట్విస్టులే ట్విస్టులు..

బుల్లితెర నటి శ్రావణి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో సమయం గడిచిన కొద్దీ కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఆత్మహత్యకు కారణం దేవరాజు రెడ్డి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన నాటి నుంచి తీవ్రంగా హింసించేవాడని, మెంటల్‌ టార్చర్‌ భరించలేకే ఆత్మహత్యకు పాల్పడిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలను ద్వారా దేవరాజు ఖండించారు. శ్రావణి ఆత్మహత్యకు కుటుంబ సభ్యులతో పాటు సాయి కృష్ణారెడ్డి అనే వ్యక్తి కారణమని పేర్కొన్నాడు. వారంతా శ్రావణిని హింసించి, కొట్టడంతోనే అవమానం తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. సాయి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని, తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు వెల్లడించాడు. శ్రావణి కాల్ రికార్డింగ్ క్లిప్పింగ్స్‌ పోలీసుల ముందుంచుతానని, తల్లిదండ్రుల ఒత్తిడితోనే శ్రావణి తనపై కేసు పెట్టిందని తెలిపాడు. ఈ క్రమంలో సాయి అనే వ్యక్తి సైతం తనపై దేవరాజు చేసిన ఆరోపణలను ఖండించాడు. దేవరాజురెడ్డి విడుదల చేసిన వీడియో అవాస్తవమని కొట్టిపారేశాడు. తాను శ్రావణికి ఫ్యామిలీ స్నేహితుడినని, శ్రావణి చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని తెలిపాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, పోలీసులతోనే ఉన్నానని సాయి వెల్లడించాడు.

శ్రావణిని మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడని, దేవరాజు పరిచయం అయిన నాటి నుంచి వారి కుటుంబం ఇబ్బంది పడని రోజు లేదని తెలిపాడు. కుటుంబ సభ్యుడిగానే ఉన్నానని మరోలా ప్రవర్తించలేంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం శ్రావణితో దేవరాజు మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్‌ ఒక వెలుగులోకి వచ్చింది. ఇందులో దేవరాజ్‌ బెదిరింపులకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘మర్యాదగా వచ్చి తనతో గంట టైం గడపాలంటూ’ బెదిరించినట్టు ఆడియోలో ఉంది. ‘తర్వాత జరిగే పరిణామాలకు తనను అడగవద్దని’ హెచ్చరించాడు. దీంతో శ్రావణి స్పందిస్తూ.. ‘ఇంతటితో ఆపేయ్‌.. నీతో మాట్లాడను దేవా’ అంటూ ప్రాధేయ పడినట్టు ఆడియోలో ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే దేవరాజును విచారణకు పిలువగా, కుటుంబ సభ్యులతో మరికొంత మందిని సైతం విచారణకు పిలువనున్నట్లు సమాచారం. సమయం గడిచే కొద్ది కొత్త కొత్త మలుపులు తీసుకుంటుండగా.. ఆడియో క్లిప్పింగులు  వెలుగులోకి వస్తుండడం ఆత్మహత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo