మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 30, 2020 , 19:44:02

25 టన్నుల ఉల్లి లారీ మాయం

25 టన్నుల ఉల్లి లారీ మాయం

తిరువనంతపురం: దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో 25 టన్నుల లోడ్‌తో వెళ్లిన లారీ మాయమైంది. కేరళలోని కోచికి చెందిన వ్యాపారి మహ్మద్ సియాద్‌ సెప్టెంబర్‌ నెలలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ మార్కెట్‌లో 25 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేశాడు. అయితే వారం రోజుల్లో చేరాల్సిన ఉల్లి లోడు లారీ, నెల రోజులైనా కోచి చేరలేదు. కాగా గత నెల 25నే లారీ ఉల్లి లోడుతో బయలుదేరనట్లు మహారాష్ట్ర కోఆపరేటివ్‌ సొసైటీ సభ్యులు ఆయనకు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా పంపారు. మరోవైపు లారీ డ్రైవర్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉన్నది. గత నెలలో ఉల్లి ధర ఎక్కువ ఉండగా ప్రస్తుతం కాస్త దిగి వచ్చింది. దీంతో ఏదో మోసం జరిగినట్లు వ్యాపారి మహ్మద్‌ సియాద్‌ అనుమానించాడు. ఉల్లి లారీ మాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరోవైపు ఎర్నాకుళంలోని అలూవా ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడికి నేర చరిత్ర ఉండటంతో ఉల్లి లోడును బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుని ఉంటాడని భావిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు సంస్థ కూడా లారీ మాయంపై ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.